Asianet News TeluguAsianet News Telugu

విస్తరణపై కేసీఆర్ దృష్టి: కేబినెట్‌లోకి కేటీఆర్, హరీష్ డౌటే?

మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. ఈ దఫా కేటీఆర్, గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

kcr likely to expansion his cabinet may in september
Author
Hyderabad, First Published Aug 28, 2019, 7:09 AM IST


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దసరా తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో దసరా కంటే ముందే విస్తరణకు కేసీఆర్ ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది. ఈ దఫా కేటీఆర్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. హరీష్ రావుకు ఈ దఫా స్థానం దక్కకపోవచ్చని అంటున్నారు.

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో ఖాయంగా చోటు దక్కే అవకాశం ఉంది. సోమవారం నాడే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడ కేబినెట్ లో బెర్త్ దక్కవచ్చు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం కేసీఆర్‌తో పాటు 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించేు అవకాశం ఉంది. రెండు విడతలుగా మంత్రివర్గ విస్తరణ చేస్తారా.. లేక ఒకేసారి ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సెప్టెంబర్ 4  లేదా 12 తేదీల్లో ఏదో ఒక రోజున కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం లేకపోలేదు. ఒకవేళ ఈ రెండు రోజులు సాధ్యం కాకపోతే దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

ఈ దఫా మంత్రివర్గంలోకి కేటీఆర్ ను తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కేటీఆర్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే హరీష్ రావు పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేటీఆర్, హరీష్ రావులకు ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కుతోందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.వెలమ సామాజిక వర్గం నుండి కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు మినహా మంత్రివర్గంలో మరెవరూ కూడ లేరు. అయితే కేటీఆర్, హరీష్ రావులకు చోటు కల్పిస్తే ఈ సామాజిక వర్గం సంఖ్య నాలుగుకు చేరుకొంటుంది.

ఈ దఫా కేటీఆర్ కు అవకాశం కల్పించి వచ్చే దఫాలో హరీష్ కు చోటు కల్పిస్తారా అనేది కూడ స్పష్టత లేదు. హరీష్ ను పార్టీకి దూరం పెడుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మంత్రివర్గంలోకి హరీష్ కు చోటు కల్పించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎస్టీ, మహిళ, మున్నూరు కాపు, కమ్మ సామాజిక వర్గాలకు ఈ దఫా కేబినెట్ లో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి  మొదటి టర్మ్ లో జోగు రామన్నకు కేసీఆర్ చోటు కల్పించారు.

 అయితే ఈ దఫా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు చోటు కల్పిస్తారనే ప్రచారం కూడ ఉంది. నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్థన్ పేరు కూడ పరిశీలనలో ఉంది. 

గిరిజన కోటాలో సత్యవతి రాథోడ్, రేగా కాంతారావుల పేర్లు కూడ పరిశీలనలో ఉన్నాయి. సత్యవతి రాథోడ్ కు చోటు కల్పిస్తే గిరిజన మహిళా కోటాలు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా కోటాలో చోటును కల్పించే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాకు కేబినెట్ లో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుండి తొలి దఫా కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు కల్పించారు. ఈ దఫా మాత్రం ఖమ్మం జిల్లా నుండి ఎవరికీ చోటు ఇవ్వలేదు. ఈ దఫా పువ్వాడ అజయ్, అరికెపూడి  గాంధీ, మాగంటి గోపినాథ్ ల పేర్లు కమ్మ సామాజిక వర్గం నుండి వినిపిస్తున్నాయి.

తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలు కావడంతో ఆయనను మంత్రివర్గంలో తీసుకొంటారా లేదా అనేది స్పష్టత లేదు. తుమ్మల నాగేశ్వరరావును మంత్రివర్గంలోకి తీసుకొంటే ఓడిపోయిన ఇతర నేతలకు కూడ కేబినెట్ లో బెర్త్ కల్పించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు.

ఖమ్మం జిల్లా నుండి సండ్ర వెంకటవీరయ్యకు చోటు దక్కే అవకాశం ఉంది. సండ్ర వెంకటవీరయ్యకు దళిత సామాజిక వర్గం నుండి చోటు దక్కనుంది. ఎస్సీలోని మాదిగ ఉప కులం నుండి ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయంగా కన్పిస్తోంది.

ఇక బీసీ కోటాలో దానం నాగేందర్, వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ ల పేర్లు కూడ ప్రముఖంగా విన్పిస్తున్నాయి. బీసీ కోటాలో కేబినెట్ లో ఉన్న ఈటల రాజేందర్ కు ఈ దఫా కేబినెట్ నుండి ఉద్వాసన పలికే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆయనను తప్పిస్తే ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గం నుండి బలమైన నేతకు చోటు కల్పించే అవకాశం లేకపోలేదు. 

ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుండి కేసీఆర్ మంత్రివర్గంలో ఐదుగురు కొనసాగుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలకు చోటు కల్పించాలంటే ఇద్దరిని కేబినెట్ నుండి తొలగించాల్సి ఉంటుంది. 

లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుండి ఏడుగురు కేబినెట్ లో ఉంటారు. దీనివల్ల సామాజిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు,.అయితే కేసిఆర్ కేబినెట్ లో చోటు కోల్పోయే వాళ్లు ఎవరనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. 

కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకొంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడ కేటీఆర్ వద్దే ఉంటుందా... లేదా ఈ పదవిని మరోకరికి అప్పగిస్తారా అనే చర్చ కూడ లేకోపోలేదు. కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకొంటే కవితకు ఈ పదవిని ఇస్తారా అనే చర్చ కూడ ఉంది. కవిత ఎంపీగా ఈ దఫా ఓటమి పాలైంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

Follow Us:
Download App:
  • android
  • ios