హైదరాబాద్: నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు,  కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 

శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.దిశ నిందితుల ఎన్‌కౌంటర్ గురించి సజ్జనార్ మీడియాకు సమాచారం ఇచ్చారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుమోటో‌గా తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్సీ

శంషాబాద్ తొండుపల్లి టో‌ల్‌ప్లాజా వద్ద గత నెల 27వ తేదీన దిశను హత్యచేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ గుర్తు చేశారు. ఈ ఘటనపై తొలుత ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఆ తర్వాత శాస్త్రీయమైన సాక్ష్యాలను సేకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

నారాయణపేట జిల్లాకు చెందిన  ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు, శివలను  గత నెల 29వ తేదీన అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. గత నెల 30వ తేదీన రిమాండ్‌కు తరలించినట్టుగా తెలిపారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

ఈ నెల 3వ తేదీన నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇచ్చినట్టుగా ఆయన ప్రస్తావించారు. ఈ నెల 4వ తేదీన నిందితులను చర్లపల్లి జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

 విచారణ చేసే సమయంలో  చాలా విషయాలను  నిందితులు తమకు చెప్పారన్నారు. నిందితులు దాచిన వస్తువులను సీజ్ చేసేందుకు చటాన్‌పల్లికి వచ్చిన సమయంలో  నిందితులు తమపై దాడికి ప్రయత్నం చేసినట్టుగా సీపీ సజ్జనార్ తెలిపారు.

Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య

నిందితులు తమపై రాళ్లతో పాటు కర్రలతో దాడికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను తీసుకొని కాల్పులు జరిపినట్టుగా తెలిపారు.దిశ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయడంపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని సజ్జనార్ తెలిపారు.

దిశ సెల్‌ఫోన్, వాచీలను చూపిస్తామని నిందితులు తమకు చెప్పారన్నారు. ఈ వస్తువులను చూపించే క్రమంలోనే తమపై దాడికి పాల్పడి ఆయుధాలను లాక్కొన్నారని సీపీ చెప్పారు. 

ఈ సమయంలో పోలీసులు నిందితులను హెచ్చరించినట్టుగా తెలిపారు. కానీ నిందితులు మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే నిందితులపై తాము కాల్పులు జరిపినట్టుగా ఆయన తెలిపారు.

కొద్దిసేపు కాల్పులు జరిగాయన్నారు. ఇవాళ ఉదయం ఐదుగంటల నుండి ఆరు గంటల సమయంలో నిందితులు తమపై దాడికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు

నిందితులు చేసిన దాడిలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌ గాయపడినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.తమపై నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు దాడికి పాల్పడినట్టుగా సజ్జనార్ తెలిపారు. నిందితుల నుండి రెండు  ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ నలుగురు నిందితులు ఈ ఒక్క ఘటనకే పరిమితం కాలేదని సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో కూడ కొన్ని ఘటనల్లో కూడ  వీళ్ల పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.దిశ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయడంపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని సజ్జనార్ తెలిపారు.