India inflation: ఏప్రిల్‌లో భారత ద్రవ్యోల్బణం 3.16 శాతానికి తగ్గింది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళ అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
India inflation: భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.16 శాతానికి తగ్గిందని గణాంకాల శాఖ (Ministry of Statistics and Programme Implementation) విడుదల చేసిన తాజా సమాచారం వెల్లడించింది. ఇది జూలై 2019 తర్వాత దేశంలో నమోదైన అతి తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం. ముఖ్యంగా ఆహార ధరలు తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.
ఏప్రిల్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 1.78 శాతానికి తగ్గింది. ఇది మార్చిలో 2.69 శాతంగా ఉంది. ఇది అక్టోబర్ 2021 తర్వాత అత్యల్ప స్థాయి. కూరగాయల ధరలు ఏప్రిల్‌లో ఏడాది ప్రాతిపదికన 11 శాతం తగ్గాయి. మార్చిలో వీటి ధరలు ఏడాది ప్రాతిపదికన 7 శాతం తగ్గిన నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది.
ఇక రాష్ట్రాలవారీగా చూస్తే, కేరళ ఏప్రిల్‌లోనూ దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. ఇది వరుసగా నాల్గో నెలగా కొనసాగుతోంది. మార్చిలో 6.59 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.94 శాతానికి తగ్గినప్పటికీ, ఇది ఇప్పటికీ దేశంలో అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కేరళ ద్రవ్యోల్బణం 6.46 శాతంగా ఉండగా, పట్టణాల్లో ఇది 4.91 శాతంగా నమోదైంది.
కేరళలో దాదాపు 80 శాతం వినియోగం దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వినియోగదారుల ఆధారంగా ఉంది. అధిక వేతనాలు, జనాభా మార్పులు వంటి అంశాలు ధరలపై ఒత్తిడిని పెంచి ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నట్లు గణాంకాల శాఖ తెలిపింది.
కేరళ తర్వాత కర్ణాటక 4.26 శాతం ద్రవ్యోల్బణంతో నిలిచింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ (4.25 శాతం), పంజాబ్ (4.29 శాతం), ఉత్తరాఖండ్ (3.81 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి.
దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం తెలంగాణలోనే..
మరోవైపు, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో తెలంగాణలో ద్రవ్యోల్బణం 1.26 శాతంగా ఉంది. తెలంగాణ తర్వాత అత్యల్ప ద్రవ్యోల్బణం ఢిల్లీలో నమోదైంది. అక్కడ ద్రవ్యోల్బణం 1.77 శాతంగా నమోదైంది. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ద్రవ్యోల్బణం రెండు శాతానికి దిగువగా ఉంది.
తెలంగాణలో ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.26 శాతంగా నమోదైంది. ఇది మార్చిలో నమోదైన 1.06 శాతం కన్నా స్వల్పంగా పెరిగినా, దేశ సగటు స్థాయి 3.16 శాతం కంటే చాలా తక్కువ. ఈ రేటు భారత రిజర్వ్ బ్యాంక్ సూచించిన ఆరోగ్యకరమైన ద్రవ్యోల్బణ పరిధి (2% - 4%) కంటే దిగువగా ఉండడం గమనార్హం.
విభాగాల వారీగా చూస్తే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కేవలం 0.44 శాతంగా నమోదైంది, ఇది దేశంలో అత్యల్పంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 1.99 శాతంగా ఉంది, ఇది ఢిల్లీ తర్వాత రెండవ తక్కువ రేటు. దేశస్థాయిలో గ్రామీణ ద్రవ్యోల్బణం సగటు 2.92 శాతం కాగా, పట్టణంలో అది 3.36 శాతంగా ఉంది. మార్చిలో 1.06 శాతం, ఫిబ్రవరిలో 1.31 శాతం, జనవరిలో 2.22 శాతం ద్రవ్యోల్బణంతో తెలంగాణ తక్కువ స్థాయిల్లో కొనసాగుతోంది.
ఇది దేశంలో మొత్తం ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది. ఆహార ధరల తగ్గుదలతో కలిపి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం లోనవుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోంది.