పెళ్లైన తరువాత 25 రోజులు మాత్రమే కాపురం చేసిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఆయనకు చుక్కలు చూపించింది. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టింది.
హైదరాబాద్ : ఐఏఎస్ అధికారికి అత్తింటి వేధింపులు ఎదురయ్యాయి. భార్య, అత్తింటి వారు రకరకాలుగా వేధింపులకు గురి చేస్తుండడంతో బంజారా హిల్స్ పోలీస్ లను ఆశ్రయించాడు ఓ ఐఏఎస్ ఆఫీసర్. తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు రకరకాల కారణాలతో వేధిస్తున్నారని భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..
సందీప్ కుమార్ ఝా బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలంగాణ కేడర్లో పనిచేస్తున్నారు. 2021 నవంబర్ 21న పల్లవి ఝా అనే యువతితో వివాహం జరిగింది. వివాహానంతరం అప్పటికే తెలంగాణ క్యాడర్లో ఉండడంవల్ల బంజర హిల్స్ లో కాపురం పెట్టారు. అక్కడ కేవలం 25 రోజుల మాత్రమే అతనితో కాపురం చేసింది. ఆ సమయంలో కూడా ఆమె, తనతో.. తన కుటుంబ సభ్యులతో తరచుగా గొడవలు పడేదని ఆయన చెప్పారు.
కీచకుడు : రోడ్డుపై వెడుతున్న యువతిని వివస్త్రను చేసి.. మందుబాబు అరాచకం..
అంతేకాకుండా తన ఇంట్లో ఉన్న సమయంలో పల్లవి సోదరుడు ఇంట్లో ఉన్న రూ.65వేలు దొంగతనం చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు సందీప్. నిలదీయడంతో అప్పటినుంచి పల్లవి ఝా, ఆమె తండ్రి ప్రమోద్ ఝా, సోదరుడు ప్రంజాల్ ఝా.. వేధింపులకు గురిచేసే వారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తప్పుడు ఆరోపణలతో బీహార్లో తనమీద కేసు నమోదు చేయించారని తెలిపారు.
సొంతూరులోని తన ఇంటి మీద కూడా అత్తింటి వారు దాడి చేయించారని.. తన కుటుంబ సభ్యులను గాయపరచారని.. అంత చూస్తామని బెదిరించారని…తనపై తప్పుడు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారని.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సందీప్ కుమార్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిమీద దర్యాప్తు చేపట్టారు.
