హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు మంత్రి ఈటల రాజేందర్. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం గాలి వార్తలేనంటూ చెప్పుకొచ్చారు. అలాంటి గాలివార్తలపై తాను స్పందిచనన్నారు. చెప్పేవాళ్లు, విమర్శలు చేసేవాళ్లు ఎన్నైనా చెప్తారు, చేస్తారంటూ మండిపడ్డారు.

ఇకపోతే గత కొంతకాలంగా ఈటల రాజేందర్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలో సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారని ఆ సమయంలో ఇద్దరు మంత్రులపై వేటు వేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఈటలకు ఉద్వాసన తప్పదా?

ఆ ఇద్దరు మంత్రుల్లో ఈటల రాజేందర్ ఒకరంటూ హల్ చల్ చేస్తున్నాయి. ఈటలకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికితే ఆయన పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే గతంలో టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని, బతికొచ్చినోన్ని కాదని చెప్పారు. 

తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న ఈటల ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పుకొచ్చారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఈ ఏడాది ఆగష్టు నెలలో హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ అనెటోడు తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవంతో గల్తెత్తి బతికినోడు, ఈ చిల్లరమల్లర వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో ద్రోహులెవ్వరో, మోసగాళ్లెవరో అసలు సిసలైన వాడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటదంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దొంగలు, మోసగాళ్లు ఒక్కసారి ఒక్కసారి ద్రోహం చేస్తారు కావొచ్చు. కానీ, ధర్మాన్ని మాత్రం ఎవడూ మోసగించలేడు. న్యాయాన్ని మాత్రం కప్పిపుచ్చలేడు. ఇది మాత్రం సత్యం అంటూ ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. 

తనకు గెలవగలిగే సత్తా ఉందని, అమ్ముడుపోకుండా ఉన్నోడిని అంటూ చెప్పుకొచ్చారు. లేనిపోనివి చెబితే మాత్రం దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను మాట్లాడితే గంటలు మాట్లాడుతానని తనకు కూడా ఎక్కడో బాధ ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

చెరో దారి: గంగుల, ఈటల మధ్య కొనసాగుతున్న అగాధం

అయితే తన బాధను తన నోటి నుంచి వినడం కాదు, ఎన్నడో ఒకనాడు అన్నీ తప్పకుండా బయటకొస్తాయన్నారు. ఎవడు ద్రోహో, ఎవడు వీరుడో తెలిసే రోజు తప్పకుండా వస్తుందంటూ ఈటల రాజేందర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 

తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని, మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని చెప్పుకొచ్చారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదన్నారు. 

నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ వ్యాఖ్యానించారు. కుసంస్కారుల పట్ల, సొంతగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనది మొదటి నుంచి గులాబీ వర్గమేనంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 

ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేశాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సైతం స్పందించాల్సి వచ్చింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభించిన సమయంలోనూ మంత్రి ఈటలను కేసీఆర్ మందలించారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్ స్కామ్: చిక్కుల్లో ఈటల రాజేందర్?