చెరో దారి: గంగుల, ఈటల మధ్య కొనసాగుతున్న అగాధం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ మరో ఇద్దరికి మంత్రి పదవులు కటేాయించింది. అయితే ఇద్దరు మంత్రుల మధ్య అగాధం కొనసాగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య సఖ్యత లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు నలుగురికి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ నెల 8వ తేదీన మరో ఇద్దరికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.
గంగుల కమలాకర్ , కేటీఆర్ లకు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే గంగుల కమలాకర్ మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఇదే జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మధ్య అగాధం అలానే ఉందని కొన్ని ఘటనలు తేట తెల్లం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు.
ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఇద్దరు మంత్రులు కలుసుకొన్నా కూడ మాట్లాడుకోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు వేర్వేరుగానే పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొనలేదు.కానీ, ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం సెప్టెంబర్ 27న కరీంనగర్ లో జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఈటల రాజేందర్ వేర్వేరుగా పాల్గొన్నారు.
వీరిద్దరి మధ్య కొంత కాలంగా మంచి సంబంధాలు లేవనే ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ విస్తరణకు కొన్ని రోజుల ముందే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.మంత్రి పదవి తనకు భిక్ష కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు కొందరు డబ్బులు కూడ పంచిపెట్టారని ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయటపెడతానని ఈటల కుండబద్దలు కొట్టారు.
బీసీ కార్డును అడ్డుపెట్టుకొని తాను ఏనాడూ కూడ మంత్రి పదవిని అడగలేదని కుండబద్దలు కొట్టారు.ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ యూటర్న్ తీసుకొన్నారు.
మరో వైపు మంత్రి పదవిని చేపట్టడానికి కొన్ని గంటల ముందు గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి ఈటల రాజేందర్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పైకి విభేదాలు లేవని చెబుతున్నా కూడ ఆచరణలో అందుకు విరుద్దంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గంగుల కమలాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈటల రాజేందర్ దూరంగా ఉంటున్నారని జిల్లా వాసులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొంటే గంగుల కమలాకర్ వర్గీయులు దూరంగా ఉంటున్నట్టు ప్రచారంలో ఉంది.
తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు చెబుతున్నా కూడ జరుగుతున్న ఘటనలు మాత్రం వీరిద్దరి మధ్య అగాధం ఉందనే విషయాన్ని బయటపెడుతున్నాయి.