హైదరాబాద్: గులాబీ ఓనర్ల నినాదం ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చిక్కుల్లో పడనున్నారా? నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్ కుంభకోణం వ్యవహారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. హైదరాబాదులో వైరల్ ఫీవర్ ప్రజలను పట్టిపీడిస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ కాస్తా ఇబ్బందుల్లో పడినట్లు కనిపించారు. అయితే, ప్రజల మధ్యన చురుగ్గా కదిలే ఈటల ఆస్పత్రులను చుట్టుముడుతూ తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా నీలోఫర్ కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

చాలా కాలంగా నీలోఫర్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈటల ఏం చేశారనే ప్రశ్న ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంలో ఈటలను ఆ వివాదం చుట్టుముట్టే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈటల తర్వాత గులాబీ ఓనర్ల నినాదం ఎత్తుకున్న మాజీ  హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. మంత్రిగా పనిచేసిన తనకు కార్పోరేషన్ పదవి చాలా చిన్నది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిరసన స్వరం వినిపించిన ఆయన తర్వాత చల్లబడ్డారు. నాయిని నర్సింహా రెడ్డి చల్లబడినప్పటికీ వ్యవహారం ముగిసిపోలేదని ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారం తెలియజేస్తోంది. 

ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో నాయిని అల్లుడు, కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో నాయిని నర్సింహా రెడ్డి పూర్తిగా వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు. తాజాగా, ఈటల రాజేందర్ కూడా ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి రావచ్చునని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

పదేళ్లుగా నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్: విచారణలో వెలుగుచూసిన దారుణాలు

నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్: పంపకాల తేడాతో బట్టబయలైన ప్రొఫెసర్ల దందా