హనుమకొండలో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు తాను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో రానో తెలియదని బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం తాను నడుచుకుంటానని తెలిపారు.
ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రానున్నారు. హనుమకొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే దీనికి జనాన్ని సమీకరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం హనుమకొండలో సాయంత్రం సమయంలో జరిగింది. అయితే ఈ సమయంలో కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బండి సంజయ్ తో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ చీఫ్ ను మారుస్తున్నారంటూ కొంత కాలం నుంచి జోరుగా ప్రచారం సాగుతోందని, ఇందులో నిజమెంతా అని అడిగారు. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. ప్రధాని మోడీ బహిరంగ సమావేశానికి తాను బీజేపీ తెలంగాణ చీఫ్ హోదాలో వస్తానో, రానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఈ సమాధానానికి కార్యకర్తలు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ‘మీ వల్లే బీజేపీ నేడు పల్లెల వరకు చేరింది. మీ వల్లే గ్రామాల్లో అధికార బీఆర్ఎస్ నాయకులను ఎండగడుతున్నాం. మీ వల్ల మాకు ప్రజల్లో గౌరవం పెరిగింది. మీరే తెలంగాణ చీఫ్ గా కొనసాగాలి’’ అని బండి సంజయ్ ను కోరారు. అయితే పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని తాను తప్పక పాటించాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్తా కృషి చేయాలని కోరారు.
