ఓ తల్లి తన కుమారుడిని హతమార్చింది. పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో డెడ్ బాడీని మాయం చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు కనిపించడం లేదంటూ వారితో బాధపడింది. చివరికి ఈ కేసులో పోలీసులు విచారణ జరిపి అసలు విషయం ఏంటో తేల్చారు. 

ఆ మహిళకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు తనతో ఉంటే ప్రియుడు తనని పెళ్లి చేసుకోడని భావించింది. దీంతో కుమారుడిని హతమార్చింది. దృశ్యం సినిమాలో చూపించిన విధంగా డెడ్ బాడీని మాయం చేసింది. అనంతరం తన బిడ్డ కనిపించడం లేదంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. చివరకు కన్నతల్లే కుమారుడిని కడతేర్చిందని నిర్ధారించి ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. 

‘‘యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు బీఎస్పీ వ్యతిరేకం కాదు.. కానీ..’’- మాయావతి

వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ కు చెందిన 22 ఏళ్ల నయన మాండవి అనే మహిళ గుజరాత్ లోని సూరత్ జిల్లాలో నివసిస్తోంది. దిండోలీ ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తోంది. అయితే ఆమె జూన్ 27వ తేదీన తన రెండేళ్ల కుమారుడు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళ పని చేస్తున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అందులో పిల్లాడు బయటకు వచ్చినట్టుగా ఎలాంటి అనవాళ్లు కనిపించడం లేదు. దీంతో బాబు నిర్మాణ స్థలం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తప్పిపోయిన పిల్లాడి కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్ ను కూడా ఉపయోగించారు. కానీ ఆ బాలుడు నిర్మాణ స్థలాన్ని సజీవంగా విడిచిపెట్టినట్లు వారికి ఆధారాలు లభించలేదు.

మరో బాంబు పేల్చిన సుఖేష్ చంద్రశేఖర్.. కేజ్రీవాల్ కు దుబాయ్ లో 3 ఫ్లాట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు

అప్పుడే పోలీసులకు తల్లి నయన మాండవిపై అనుమానం వచ్చింది. కుమారుడి అదృశ్యంపై పోలీసులు ఆమెను విస్తృతంగా ప్రశ్నించారు. కానీ ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో పోలీసులు సంతృప్తి చెందలేదు. ఇలా ప్రశ్నిస్తున్న సమయంలోనే జార్ఖండ్ లో నివసిస్తున్న తన ప్రియుడిపై ఆమె ఆరోపణలు చేసింది. అతడే తన బిడ్డను కిడ్నాప్ చేశాడని తెలిపింది. దీంతో ప్రియుడిని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు విచారణలో అతడెప్పుడూ సూరత్ కు రాలేదని తేలింది. 

దీంతో పోలీసులు నయనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో తానే కుమారుడిని హత్య చేశానని ఒప్పుకుంది. మృతదేహం ఎక్కడుందని పోలీసులు ప్రశ్నించగా.. తొలుత గుంతలో పూడ్చిపెట్టానని చెప్పింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తవ్వి చూశారు. కానీ అందులో ఏమీ లభించలేదు. తరువాత చెరువులో పడేశానని చెప్పింది. కానీ అక్కడా పోలీసులకు ఎలాంటి అనవాళ్లు లభించలేదు. మళ్లీ ఆమెను క్షుణ్ణంగా విచారించగా మృతదేహాన్ని నిర్మాణ స్థలంలోని మరుగుదొడ్డి కోసం ఉద్దేశించిన గుంతలో పడేసినట్లు వెల్లడించింది. ఎట్టకేలకు ఆ ప్రదేశం నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.

అమానవీయం..రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోతున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీసు.. వీడియో వైరల్

అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలికి ఓ ప్రియుడు ఉన్నాడని, కానీ కుమారుడు ఆమెతో ఉంటే పెళ్లి చేసుకోవడానికి అతడు సిద్ధంగా లేడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే బాలుడిని వదిలించుకుంటే తన ప్రియుడితో పెళ్లి జరుగుతుందని ఆమె భావించినట్టు పోలీసులు తెలిపారు. నయన క్రైమ్ థ్రిల్లర్స్ ను క్రమం తప్పకుండా చూసేదని గుర్తించారు. ఈ క్రమంలోనే దృశ్యం సినిమాను రెండుసార్లు చూసిందని, అందుకే బాలుడిని చంపి మృతదేహం కనిపించకుండా చేస్తే, దీని నుంచి సులువుగా భయటపడొచ్చని ఆమె భావించిందని తెలిపారు.