తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రారంభం కాబోతుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది.
తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే హైదరాబాద్‌కు మరో వందే భారత్ రైలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే త్వరలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ బీజేపీ నేతలతో ఈ విషయాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ వందేభారత్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇది కార్యరూపం దాల్చితే.. తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది. ఈ ట్రైన్‌కు సంబంధించిన వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. దేశంలోని రెండు ప్రధాన టెక్ నగరాల మధ్య ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యంగా ఉండనుంది. మరోవైపు సికింద్రాబాద్-పుణె మధ్య కూడ మరో వందే భారత్ రైలును నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్- బెంగళూరు మధ్య పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో ఎక్కువ ట్రైన్‌లు కాచిగూడ నుంచి ప్రారంభం అవుతున్నాయి. రెండు నగరాల మధ్య దాదాపు 570 కి.మీ దూరం ఉంది. ఇక, బెంగళూరు-హైదరాబాద్‌లోని కాచిగూడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని భావిస్తున్నట్లు జనవరిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు కర్ణాటకలోని బీజేపీ నేతలు కొందరు ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారంలో బెంగళూరు-హైదరాబాద్‌ల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతున్నట్టుగా ప్రస్తావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
