కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోస్టల్ ఆఫీసులో పార్శిల్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్య మంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత, కొందరు సినీ  ప్రముఖుల ఇంటి అడ్రస్ లకు మురుగు నీరు పార్శిల్స్ వచ్చాయి. నీటి సమస్య గురించి తెలియజేయడానికి ఈ పార్శిల్స్ పంపి ఉండవచ్చని అందరూ భావించారు. అయితే... నిజానికి కారణం అది కాదట. తన ప్రేమను కాదన్నదని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు ఈ పథకం వేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కుమ్మెరిగూడ ప్రాంతానికి చెందిన వొడ్డపల్లి వెంకటేశ్వరరావు(32) సికింద్రాబాద్‌ మార్కెట్‌ ప్రాంతంలో మసాలా వ్యాపారం చేస్తున్నాడు. అతడు 2008 నుంచి 2010 వరకూ బొల్లారంలోని నవభారతి పీజీ కాలేజ్‌లో ఎంబీఏ చదివాడు. ఆ సమయంలో ఓ యువతితో స్నేహంచేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. తన స్నేహాన్ని తిరస్కరించినందుకు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం జరిగిన ఎంబీఏ పరీక్షల్లో తప్పాడు. తాను ఫెయిల్ అవ్వడానికి ఓ లెక్చరర్ కారణమని భావించాడు. అతనిపై కూడా పగ  పెంచుకున్నాడు. వీరిద్దరినీ ఇరికించాలని వారి పేర్లతో ఈ పార్శిల్స్ తయారు చేశాడు. 

మార్కెట్‌లోని తన దుకాణంలో గుర్తుతెలియని ద్రావణంతో నిండిన 62 సీసాలను భద్రపరిచాడు. ఆగస్టు 16న తన దుకాణంలో ఉన్న ద్రావణ సీసాలను కాటన్‌ బాక్స్‌ల్లో నింపాడు. అక్కడి నుంచి ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న పోస్టాఫీస్ కి ఆటోలో చేరుకున్నాడు. 

అప్పటికి సమయం మించిపోవడంతో పోస్టల్‌ సిబ్బంది, మరుసటిరోజున రావాల్సిందిగా సూచించారు. దాంతో చేసేదేమీలేక వెనుదిరిగిన వెంకటేశ్వరరావు తన పార్శిల్‌ను పోస్టాఫీ్‌సలో ఉంచాలని ప్రాధేయ పడ్డాడు. వారు సరేననడంతో పార్సిల్‌ను అక్కడే ఉంచి వెళ్లాడు. తర్వాతిరోజు ఆగస్టు 17న తిరిగి పోస్టాఫీసుకు వెళ్లాడు. ఫ్రం అడ్రస్‌ వద్ద యువతి పేరు, ఉస్మానియా లెక్చరర్ల పేర్లు, చిరునామాలు రాసి వీఐపీలు, అధికారులకు పార్శిళ్లను రిజిస్టర్‌ పోస్ట్‌ చేశాడు. పోస్టల్‌ చార్జీలు రూ.7216 చెల్లించి, రసీదులు తీసుకున్నాడు.

ఈ నెల 19న డిస్పాచ్‌ సెక్షన్‌ అధికారులు పార్శిల్‌ బాక్సుల నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించారు. వీటిని పోస్టు చేసిన వ్యక్తి అడ్రస్‌, సమర్పించిన వివరాలు తప్పని గ్రహించారు. వెంటనే మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితుడు పోస్టాఫీ్‌సకు వచ్చిన ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్‌ను విచారించారు. 

ఆటో డ్రైవర్‌లు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావును గుర్తించి ప్యాట్నీ సెంటర్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఒకల్యా్‌పటాప్‌, ఒక ప్రింటర్‌ కమ్‌ స్కానర్‌, ఒక సెల్‌ఫోన్‌, 8 ప్లాస్టిక్‌ టేపులతోపాటు టీవీఎస్‌ ఎక్సెల్‌ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని మహంకాళి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్, కవితలకు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్

బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్ సహా పలువురికి పార్శిల్స్

కేసీఆర్ కు బాటిల్స్ పార్శిల్ కలకలం: తేలిందేమిటంటే..