Hyderabad Scam: సైబరాబాద్ పోలీసులు 850 కోట్ల రూపాయల పోంజి స్కీమ్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నకిలీ కంపెనీలు, వెబ్‌సైట్ల ద్వారా 3,100 మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Hyderabad Scam: టెక్నాలజీ, డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా AI ఆధారిత పెట్టుబడులు, క్రిప్టో ట్రేడింగ్, పోంజీ స్కీమ్స్ పేరిట కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ బురిడి కొట్టిస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఈ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లోని ఏవి సొల్యూషన్స్‌, ఐఐటి క్యాపిటల్స్‌ పేరుతో భారీ స్కాం బయటపడింది. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి, 3,164 మంది బాధితుల నుండి ఏకంగా ₹850 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే… ఏవి సొల్యూషన్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్‌, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎండీలు శ్రియస్ పాల్, వెంకట్రావు కలిసి నకిలీ కంపెనీల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశారు. పెట్టుబడిదారులకు ప్రతినెల 7% లాభం, ఏటా 84% రాబడి వస్తుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ సొమ్మును 21 మ్యూల్‌ ఖాతాల్లోకి తరలించి, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు నమ్మించారు. వాస్తవానికి అనంతరం ఆ డబ్బులను విదేశాలకు తరలించి, ఆ డబ్బుతో దుబాయ్‌లో మనీ లాండరింగ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ కేసును ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (EOW)అధికారులు దర్యాప్తు చేశారు. వారి దర్యాప్తులు ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వేణుగోపాల్‌, వెంకట్రావు, శ్రేయాస్‌ పాల్‌ అనే ముగ్గురు కేటుగాళ్లు పోంజీ స్కీమ్‌ పేరుతో 3,164 మందిని మోసం చేసిన ₹850 కోట్లు కొట్టేశారు. మాదాపూర్‌లో నకిలీ కంపెనీలు, వెబ్‌సైట్లు సృష్టించి అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించారు. నిందితులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తులో .. 2022 నుంచి 2025 వరకు నిందితులు పలు నకిలీ సంస్థలను నడిపారు. వేణుగోపాల్‌ AV సొల్యూషన్స్ పేరిట 2,388 మందిని మోసగించి రూ.442 కోట్లను కొల్లగొట్టాడు. వెంకట్రావు IIT క్యాపిటల్ టెక్నాలజీ పేరిట 778 మందిని మోసగించి రూ.410 కోట్లు దోచుకున్నాడు. శ్రేయాస్‌ పాల్‌ వీరికి కీలకంగా ఉండేవాడని పోలీసులు గుర్తించారు. ఈ డబ్బుతో నిందితులు విలాసవంతమైన కార్లు, స్థిరాస్తులు, బంగారం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏఐ టెక్నాలజీతో భారీ సెమినార్లు నిర్వహించేవారని గుర్తించారు. నిందితుల వద్ద నుండి విలువైన కార్లు, 11 ల్యాప్‌టాప్‌లు, 3 మొబైల్‌ ఫోన్లు, బాధితుల డేటాబేస్‌, బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లను కూడా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. భారీ మోసం బయటపడటంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు.