Srishti surrogacy scam: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు

Srishti Fertility Centre Surrogacy Scam: సరోగసి పేరుతో జరిగిన కుంభకోణం దేశాన్ని వణికిస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో డాక్టర్ నమ్రతపై మరింత సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. సరోగసి పేరుతో ఏకంగా 80 మంది పిల్లలను అమ్మేసిందని, ఆమె స్వయంగా విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన ప్రకారం, డాక్టర్ నమ్రత వేర్వేరు ప్రాంతాల నుండి పిల్లలను సేకరించి, వారికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. అయితే ఆమెతో కలిసి పని చేసిన ఏజెంట్ల వివరాలపై మాత్రం స్పష్టత ఇవ్వకలేకపోయారని పోలీసులు తెలిపారు.

మరోసారి కస్టడీకి డిమాండ్

80 మంది చిన్నారుల తల్లిదండ్రుల వివరాలు ఇంకా తెలియకపోవడంతో డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి తీసుకోవాలంటూ గోపాలపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేసులో 17 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డా. నమ్రతను కూడా మొదట్లో అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన 80 మంది పిల్లల వ్యవహారంతో, పూర్తి సమాచారం వెలికితీసే ఉద్దేశ్యంతో మళ్లీ కస్టడీ కోరుతున్నారు. 

పోలీసుల దర్యాప్తు ప్రకారం, పేద కుటుంబాల నుంచి బిడ్డలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఐవీఎఫ్/సరోగసి పేరుతో వచ్చే సంతానం లేని దంపతులకు లక్షల రూపాయాలకు అమ్మినట్టు తెలుస్తోంది. సృష్టి క్లినిక్ నిర్వాహకులు వైద్యాన్ని వాణిజ్యంగా మలచిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీరు-బిర్యానీ ఆఫర్లతో వీర్య సేకరణ?

ఇంకా విస్తుపోయే అంశం ఏంటంటే, సికింద్రాబాద్ పరిధిలోని బిచ్చగాళ్లను టార్గెట్ చేసి, వారికి బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారిని నుంచి వీర్యాన్ని సేకరించినట్లు సమాచారం. ఆ వీడియోలు చూపించి వీర్య సేకరణ చేసిన తీరుపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా, గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్‌ నుంచి భారీగా IVF & సరోగసీ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కొండాపూర్, అలాగే విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, కోల్‌కతా లాంటి నగరాల్లో బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాని, దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న గొప్ప స్కాంగా పోలీసులు భావిస్తున్నారు. సరోగసీ పేరుతో పిల్లల్ని వ్యాపార వస్తువులుగా మలచిన ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.