Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
Telangana Panchayat Elections: తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందంజలో నిలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా గట్టి పోటీనిచ్చారు.

భారీ పోలింగ్‌తో ప్రారంభమైన తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ గురువారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా, ఆ సమయంలో క్యూలో నిలబడ్డ ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు.
మొత్తం 4,236 పంచాయతీలలో జరిగిన ఈ దశలో 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 84.28 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. దాదాపు 45.15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు.
పోలింగ్ పూర్తికాగానే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రారంభం నుంచే పలు జిల్లాల్లో స్పష్టమైన రాజకీయ ధోరణి కనిపించడం మొదలయ్యింది.
పోటీలో వేల మంది అభ్యర్థులు
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. సర్పంచ్ పదవుల్లో 396 + 6 (నామినేషన్లు లేకపోవడం, కోర్టు స్టే కారణంగా) ఏకగ్రీవం అయ్యాయి. వార్డు సభ్యుల్లో 9,633 + 179 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. బీఆర్ఎస్ పోటీ, బీజేపీ అంతంతే
ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించారు. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ బలపరిచిన వారు 750+ గ్రామాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన వారు 350+ గ్రామాల్లో విజయం సాధించారు.
అలాగే, ఇండిపెండెంట్స్ 180+ గ్రామాల్లో విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 70+ గ్రామాల్లో విజయం సాధించారు. ఏకగ్రీవ స్థానాలను కలుపుకుని కాంగ్రెస్ 1906 సర్పంచ్ స్థానాలు, బీఆర్ఎస్ 964 స్థానాలు, బీజేపీ 153 స్థానాలు, ఇతరులు 423 స్థానాలు గెలుచుకున్నారు. ఇది రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే కీలక సూచికగా మారింది.
పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక సంఘటనలు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో అరుదైన రాజకీయ పోటీ చోటుచేసుకుంది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ మహిళల రిజర్వేషన్ కింద ఉండటంతో తల్లికూతుళ్లు పోటీ పడ్డారు. బీఆర్ఎస్ బలపరిచిన తల్లి గంగవ్వ, కాంగ్రెస్ బలపరిచిన కుమార్తె సుమలత పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపులో సుమలత 91 ఓట్ల మెజారిటీతో స్వంత తల్లిపై గెలుపొందడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?
ఇంకా రెండు విడతల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 14, మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 17 జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది.
కొన్ని జిల్లాల్లో రీకౌంటింగ్ నిర్వహిస్తుండగా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి కల్లా అన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

