హైద్రాబాద్‌లో కుండపోత వర్షం: పలు చోట్ల ట్రాఫిక్ జాం, వాహనదారుల ఇబ్బందులు
హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైద్రాబాద్ నగరంలో గురువారంనాడు పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షానికి ఇప్పటికే రోడ్లపై వర్షం నీరు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లోని అండర్ పాస్, అండర్ బ్రిడ్జిల వద్ద వాటర్ నిలిచిపోతుంది. మాదాపూర్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్ పేట మైత్రివనం వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. కూకట్ పల్లి, ఎర్రగడ్డ వైపు వెళ్లే మార్గంలో కూడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైద్రాబాద్ మాదాపూర్ ప్రాంతంలో రోడ్డుపై కిలోమీటర్ పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నెల 24వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ ఉదయం కూడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జాం నెలకొంటుంది. ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
also read:భారీవర్షాలతో మంజీరాకు వరద: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మూసివేత
గత మాసంలో తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ వర్షపాతంలో లోటును అధిగమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో వైపు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులతో సమీక్షించారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోస్ ఆదేశించారు.శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్నవారిని తరలించాలని కమిషనర్ ఆదేశించారు.