వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు
Telangana: ధాన్యం కొనుగులు సహా పలు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శల్లో పదును పెంచి రాజకీయం హీటును పెంచుతున్నారు. తెలంగాణ మంత్రి హరిష్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ.. మోడీ సర్కారు వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
Telangana: గత కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో రెచ్చిపోయారు. ధాన్యం కొనుగోలు విషయంలో హద్దులు మీరి మరి వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీనికి తోడు తెలంగాణలో రికార్డు స్థాయిలో సాగవుతున్న వరిధాన్యం అంశం కూడా ఈ వివాదాలను మరింతగా పెంచింది. వరిధాన్యం కోనుగోలు విషయంలో ఇరు పార్టీల మధ్య నెలకొన్న మాటల యుద్ధం కారణంగా రైతులతో పాటు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఎలాగైనా రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ పట్టుబడుతోంది. కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ధాన్యం కొనుగోలు విషయంలో ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్త నిరసనలు సైతం నిర్వహిస్తోంది టీఆర్ఎస్.
Also Read: రామతీర్ధం ఘటనలో వైసీపీ, టీడీపీలదే బాధ్యత.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
ఇదిలావుండగా, రాష్ట్ర మంత్రి హరీష్ రావు మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు. సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ భవనానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులకు ప్రతికూలంగా ఉన్న మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన మోడీ సర్కారు.. రైతుల అలుపెరుగని పోరాటంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. రైతు పోరాటంతోనే సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని హరీష్ రావు తెలిపారు. అలాగే, ఆహార భద్రత అంశం కేంద్ర పరిధిలో ఉందని చెప్పిన ఆయన.. వరిధాన్యం కొనుగోలులో కేంద్రం తీరును విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వనీతి, మోడీ సర్కారు వైఖరిని రైతులకు అర్థమయ్యేలా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చెప్పాలని ఆయన సూచించారు.
Also Read: Christmas 2021: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు !
కాగా, వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టమైన లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు సగానికి పైగా, ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. ఇక కేంద్ర మంత్రులు వారికి అయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో దాదాపు ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలుచేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని అన్నారు. తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సీబీఐకి ఆ అధికారం లేదు.. ఛార్జిషీట్ ను హైకోర్టులో సవాలు చేసిన ఐఏఎస్ వై.శ్రీలక్ష్మి