Ramreddy Damodar Reddy : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కేబినెట్ లో ఐటీ శాఖమంత్రిగా పనిచేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అక్టొబర్ 4న ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Ramreddy Damodar Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ప్రస్తుతం సూర్యాపేట అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడతున్న ఆయన చికిత్స పొందతూ బుధవారం రాత్రి మృతిచెందారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుండి పోటీచేసి ప్రత్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు దామోదర్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా సూర్యాపేటలో మాత్రం బిఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఓటమితర్వాత అనారోగ్య సమస్యలతో దామోదర్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు.

మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి తుంగతుర్తిలోని తన నివాసంలోనే చికిత్స పొందేవారు. అయితే గతవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబంసభ్యులు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. దసరా పండగ తర్వాత దామోదర్ రెడ్డి స్వస్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఐటీ మంత్రిగా దామోదర్ రెడ్డి..

రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగినా రాజకీయ ప్రస్థానం మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగింది. కాంగ్రెస్ పార్టీ నుండి తుంగతుర్తి నియోజకవర్గంలో 1985 లో పోటీచేసి గెలిచారు. ఇలా వరుసగా కాంగ్రెస్ నుండే కాదు మధ్యలో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నివాళి :

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలంగాణ సీఎంవో ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయిదు సార్లు శాసనసభ సభ్యుడిగా దామోదర్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని సీఎం గుర్తుచేసుకున్నారు.

దామోదర్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు సీఎం. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.