Koneru Konappa : తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెెస్ ను కాదని ప్రతిపక్ష బిఆర్ఎస్ లో చేరారు ఓ మాజీ ఎమ్మెల్యే.
Koneru Konappa : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఓ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి భారత రాష్ట్ర సమితిలో చేరారు… గులాబి కండువా కప్పుకున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బిఆర్ఎస్ నుండే కాంగ్రెస్ లోకి కోనప్ప
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనుండి సిర్పూరు నియోజకవర్గంలో పోటీచేసి బిజెపి చేతిలో ఓడిపోయారు కోనప్ప. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఒత్తిడిమేరకు కోనప్ప పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ లో చేరారు. కానీ అక్కడ ఎక్కువకాలం ఇమడలేకపోయిన ఆయన తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
మాజీ ఎమ్మెల్యే కోనప్పతో పాటు ఆయన సోదరుడు కృష్ణారావు సైతం బిఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
