రాజకీయాలు చేసే ఏ గవర్నరైనా పనికిమాలిన గవర్నరేనని.. తమిళిసైని వెంటనే రీకాల్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటారని.. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు మాట్లాడరని నారాయణ ప్రశ్నించారు

గవర్నర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటారని.. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు మాట్లాడరని నారాయణ ప్రశ్నించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నరైనా పనికిమాలిన గవర్నరేనని.. తమిళిసైని వెంటనే రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే.. అసభ్యంగా వున్నందునే బిగ్‌బాస్‌ను విమర్శించానని ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. బిగ్‌బాస్‌లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేస్తున్నారని.. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. నాగార్జున డబ్బు కోసం కక్కుర్తి పడతారని ఆయన ఆరోపించారు.

కాగా.. రియాలిటీ షో బిగ్ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మళ్లీ తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ షోలో పాల్గొనే వారిపై విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ షో ను ‘బూతుల స్వర్గం’ అంటూ పేర్కొంటూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘‘ సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవు. తాజాగా వింత జంతువులు, భార్యా, భర్త భర్త కానొళ్ళు , అన్న చెల్లెలు కానోళ్ళు ముక్కు ముఖం తెలియని పిటపిటలాడే అందగాళ్ళు.. అచ్చోసిన ఆంబొతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజుల పాటు బూతల (బూతుల) స్వర్గంలో అమూల్య కాలాన్ని వృథా చేసే మహత్తర BIGBOSS వస్తున్నది. ’’ అని ఆయన పేర్కొన్నారు.

ALso Read:‘సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేస్త‌య్’ - బిగ్ బాస్ షోపై మళ్లీ తీవ్రంగా ధ్వజమెత్తిన సీపీఐ నారాయణ..

శక్తి యుక్తులు ఉన్న యువత సమాజం కోసం కృషి చేస్తూ.. సామాజిక న్యాయం కోసమో లేక సంపద ఉత్పత్తి కి ఉపయోగ పడకుండా వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేస్తారా ? బూతుల స్వర్గం ఉత్పత్తి చేస్తారా అంటూ నారాయ‌ణ ప్ర‌శ్నించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని సిగ్గులేని ప్రేక్షకులు టీవీల ముందు విరగబడి చూస్తూ జాతీయ సంప‌ద‌ను వృథా చేస్తారా అని అన్నారు.

‘‘ప్రేక్షకులు అడగాలి మాకేమి సందేశమిస్తున్నారని? ఏమిస్తారు ? మాలాగా మొగుళ్ళు పెళ్ళాల్ని వదిలేశి, పెళ్ళాలు మొగుడ్ని వదిలేశి అచ్చోసిన ఆంబొతుల్లాగా జీవించండని సందేశమిస్తారేమో ? గుడ్లప్పగించి చూడండి. కాసులకు కక్కుర్తి పడే ల‌జ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నఅంత కాలం, ద్రౌపది వస్త్రాబరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాక‌రంగా దిగమింగుదామా ? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని ఉరుకుదమా ? ’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ నారాయణ బిగ్ బాస్ షోపై కామెంట్స్ చేశారు.