తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు..
కొత్త మంత్రులపై క్లారిటీ
ఢిల్లీ టూర్ ముగించుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు కేటాయించబోయే శాఖలపై స్పష్టత ఇచ్చారు. తన చేతిలో ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కేవలం కర్ణాటకలో జరుగుతున్న కులగణన అంశంపైనే అధిష్ఠానంతో చర్చ జరిగినట్లు వివరించారు.
కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి బాహాటంగా విమర్శలు చేశారు. తెలంగాణకు అసలైన శత్రువులు కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. తాను సీఎం ఉన్నంత వరకు వారి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ చుట్టూ ‘దయ్యాలు’ ఉన్నాయన్న విమర్శలపై స్పందిస్తూ, “ఇవాళ ఆయన వెంట కమిషన్ విచారణకు వెళ్లిన కవిత కూడా ఆ దయ్యాల్లో ఒకటేనా?” అంటూ ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం అంశంపై త్వరలో స్పష్టత
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ నిర్వహించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలపై వివరంగా మాట్లాడతానని తెలిపారు.
కిషన్ రెడ్డిపై విమర్శలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారాడని ఆరోపించారు. ఇప్పటి వరకూ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి ముందుకొస్తే, తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
“తెలంగాణ కోసం కిషన్ ఏం చేశారు?”
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ సమస్యలు ఎప్పుడైనా ప్రస్తావించారా? ప్రధానికి రాష్ట్ర పరిస్థితులపై నివేదిక సమర్పించారా? అనే ప్రశ్నలు రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్ చెన్నైకు మెట్రో, ప్రహ్లాద్ జోషీ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారంటూ ఉదాహరణలు ఇచ్చారు. కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణకు ఏమి తీసుకురాలేదని మండిపడ్డారు.


