UPI: ఫోన్‌పే చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే.? త్వరలోనే మారనున్న నిబంధనలు
యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే రీఛార్జ్ వంటి వాటిపై కొంతమేర ఛార్జీలు వసూలు చేస్తున్నా లావాదేవీలు మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అయితే త్వరలోఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ చెల్లింపులపై మళ్లీ ఛార్జీల చర్చ
ఇప్పటివరకు యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఎటువంటి రుసుములు లేకుండా కొనసాగుతున్నా, త్వరలో వీటిపై మర్చంట్ ఛార్జీలు విధించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అధిక విలువ లావాదేవీలపై ఛార్జీలే లక్ష్యం
అయితే చిన్న మొత్తంలో లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని తెలుస్తోంది. రూ.3,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను విధించాలన్న ఉద్దేశంతో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే 2020లో అమలులోకి వచ్చిన జీరో ఎండీఆర్ పాలసీకి ఇది ముగింపు కావచ్చు.
ఆదాయంపై కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా
కొంతమంది పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ (Merchant Discount Rate) విధించాలంటూ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఇది వార్షిక ఆదాయాన్ని కాకుండా ఒక్కో లావాదేవీ విలువను ఆధారంగా చేసుకుని నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి రూపే కార్డులపై ఛార్జీల అవసరం లేదని భావిస్తున్నారు.
యూజర్లకు తక్కువ భారం
ఈ నిర్ణయం యూజర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపదు. యూజర్ల నుంచి యూపీఐ లావాదేవీలకు రుసుములు వసూలు చేయకూడదన్న ప్రభుత్వ ఆలోచన కొనసాగుతుంది. అయితే వ్యాపారులు మాత్రం బ్యాంకులకు ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలతో సంప్రదింపులు
బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ చర్చల ఫలితంగా ఒకటి లేదా రెండు నెలల్లో తాజా నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఇప్పటివరకు కేంద్రం బ్యాంకులకు ప్రాసెసింగ్ ఖర్చుల భర్తీగా సబ్సిడీలు ఇస్తూ వస్తోంది.