ఏళ్లుగా పెండింగ్‌లోనే.. ఈసారైనా ఆమోదించండి : మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. విశ్వాసమున్న నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్‌ను ఆశీర్వదిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కొత్త పార్లమెంట్‌లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో వుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫన్నీగా వున్నాయని కవిత పేర్కొన్నారు. విశ్వాసమున్న నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్‌ను ఆశీర్వదిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలను తెలంగాణలో అమలు చేయడం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ బహిరంగ సభ ఆత్మవంచన, అబద్ధాలతో ఇతరులపై నిందలు వేయడం, చరిత్రను వక్రీకరించడం తప్ప మరేమీ కాదని అన్నారు. కాంగ్రెస్ హామీలను పక్కన పెడితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయన్న గ్యారంటీ లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అబద్ధమనీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుంచి అనేక హామీలను కాపీ కొట్టారని మంత్రి ఆరోపించారు.
Also Read: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఈ నెల 20న సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు..?
కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందనీ, ఇతర రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా అమలుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతిస్తాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందిస్తూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎప్పుడూ బీజేపీకి మద్దతివ్వలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ నేత కూడా ఈడీ దాడులను ఎదుర్కోలేదన్నారు. కేవలం బీఆర్ఎస్ నేతలపైనే ఈడీ దాడులు చేస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు, రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీల్లో అవకతవకలపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో వేల కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన హరీష్ రావు దేశంలో ఆ పార్టీ స్కామ్ కల్చర్ ను ప్రవేశపెట్టిందన్నారు. వేలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించారన్నారు. ఇతరుల దయాదాక్షిణ్యాలతో తెలంగాణ ఏర్పడలేదన్నారు. ఇదిలావుండగా, బీఆర్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ లో రేవంత్ రెడ్డి పాత వీడియోలను పోస్ట్ చేసింది, ఇందులో టీడీపీ మాజీ నాయకుడుగా ఉన్నప్పుడు రేవంత్.. సోనియా గాంధీని 'బలి దేవత'గా, రాహుల్ గాంధీని 'పప్పు'గా అభివర్ణించారు. అలాగే, కాంగ్రెస్ అంటే అవినీతి..! కాంగ్రెస్ ఎన్ని కుంభకోణాలు చేసిందో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే వినండి' అని బీఆర్ఎస్ వీడియోలను షేర్ చేసింది.