మెదక్: తెలంగాణలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు మరణించాడు. బాలుడు సాయివర్ధన్ ను ప్రాణాలతో వెలికి తీయడానికి దాదాపు 12 గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వి అతన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. 

17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లనే బాలుడు మరణించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించారు. ఆక్సిజన్ ను లోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. బోరుబావి 150 అడుగులు లోతు ఉంది. దాంతో బాలుడు 25 అడుగుల లోతులో ఉండవచ్చునని భావించి సమాంతరంగా పొక్లెయిన్లతో మరో గోయి తవ్వి బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు.

మృతదేహాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు చేసిన రోదనలు గుండెలు అవిసేలా ఉన్నాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఆర్టీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. అనుమతి లేకుం్డా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చరయ్లు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. 

Also Read: బోరు బావిలో మూడేళ్ల బాలుడు:తాతా అంటూ అరుపులు, రక్షించేందుకు ఇలా....

ఇదిలావుంటే, మెదక్ జిల్లా పాపన్న పేట్ లో బోరు బావిలో పడ్డ బాలుడిని క్షేమంగా బయటికి తీసేందుకు అన్ని రకాల సాహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి హరీశ్ రావు అంతకు ముందు అన్నారు. హైదరాబాద్ నుండి రెస్క్యూ టీమ్, ఎన్ డి ఆర్ ఎఫ్ నిపుణులను సంఘటన స్థలానికి పిలిపించామని చెప్పారు.