శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. విదేశాల నుండి వచ్చే విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో సెక్యూరిటీని మరింత పెంచారు. విమానాల్లోనూ తనిఖీలు చేపట్టారు. 

Hyderabad : ఇప్పటికే ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్స్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. విదేశాల నుండి వచ్చే విమానాలను పేల్చేస్తామంటూ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు... సెక్యూరిటీని మరింత పెంచారు.

విదేశీ విమానాలకు బెదిరింపులు

ఆదివారం రాత్రి సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. విదేశాల నుండి హైదరాబాద్ కు వస్తున్న విమానాలను టార్గెట్ చేస్తూ బెదిరింపులు వచ్చాయి. లండన్ నుండి ప్రయాణికులతో వస్తున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన BA 277, ఫ్రాంక్ ఫర్డ్ నుండి వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్ వేస్ కు చెందిన LH752 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అలాగే కన్నూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో 6E7178 విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.

సురక్షితంగా ల్యాండింగ్

అయితే ఈ అంతర్జాతీయ విమానాలు ఎలాంటి ప్రమాదం లేకుండానే సోమవారం ఉదయం ల్యాండ్ అయ్యాయి. ఇండిగో విమానం కూడా సురక్షితంగానే హైదరాబాద్ చేరుకుంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు... విమానాలు ల్యాండ్ అవగానే తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానిత వస్తువులు విమానంలో లభించలేదు... దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.