Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
Hyderabad : హైదరాబాద్‌లో కీలక రోడ్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రతన్ టాటా సహా పలువురు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనతో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లో రోడ్లకు కొత్త పేర్లు.. ప్రభుత్వ భారీ వ్యూహం
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలపాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నగరంలోని కీలక రహదారులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాల పేర్లు పెట్టే ప్రతిపాదన ఇప్పుడు అధికారిక చర్చా దశలో ఉంది.
ఇదివరకు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇలా విస్తృతంగా రోడ్లను ప్రముఖుల పేర్లతో నామకరణం చేసే ఆలోచన పెద్దగా కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫ్యూచర్ సిటీ రహదారికి రతన్ టాటా పేరు
రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వరకూ విస్తరించనున్న 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భారత పారిశ్రామిక రంగానికి చిరస్థాయిగా సేవలందించిన పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదివరకే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ‘టాటా ఇంటర్‌చేంజ్’ అనే పేరును ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి అనుగుణంగా ప్రధాన రహదారికే టాటా పేరు పెట్టడం ద్వారా, హైదరాబాద్‌ను భారతీయ వ్యాపార, సాంకేతిక కేంద్రంగా మరింత స్పష్టంగా ప్రతిబింబించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరు
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కనే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఇది అమలైతే ప్రపంచంలోనే మొదటిసారిగా ట్రంప్ పేరుతో రహదారి అధికారిక నామకరణం కానుంది. తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం త్వరలో లేఖలు పంపనుంది. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ నేపథ్యంలో ఈ ఆలోచనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఐటీ కారిడార్‌లో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్
హైదరాబాద్ ఐటీ కారిడార్ రోజురోజుకు ప్రపంచ స్థాయి కంపెనీల ప్రధాన కేంద్రంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ సంస్థల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా రోడ్లలకు వారి పేర్లు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఒక ప్రధాన రహదారికి గూగుల్ స్ట్రీట్, మరోదానికి మైక్రోసాఫ్ట్ రోడ్, కీలక కూడలికి విప్రో జంక్షన్ అనే పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న గూగుల్ యూఎస్ వెలుపల అతిపెద్ద క్యాంపస్ దృష్ట్యా, ఈ పేరు ప్రతిపాదనకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.
గ్లోబల్ ఇమేజ్ పెంపు వైపు తెలంగాణ అడుగులు
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కార్పొరేషన్ల పేర్లను నగర రహదారులకు ఇవ్వడం ద్వారా వారికి గౌరవం ఇవ్వడంతో పాటు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు, ప్రయాణించే వారికి స్ఫూర్తి, పెట్టుబడుల అవకాశాలకు ఆకర్షణ అనే నాలుగు ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి విజన్‌లో భాగంగా, హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇంటర్నేషనల్ పార్టనర్‌షిప్ హబ్‌గా నిలపాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

