హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల నడ్డివిరిచారని ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశారని, పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్న సందేహాన్ని కలిగించేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో జరుగుతున్న అన్యాయాలను తట్టుకోలేక, అన్యాయానికి గురవుతున్న క్యాడర్ ను కాపాడుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. తాను తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందోనని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు.  

2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో తాను కీలక పాత్ర పోషించానని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ గా ఉంటూ ఆ పార్టీలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో తాను కూడా కీలక భూమిక పోషించినట్లు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చారు. 30ఏళ్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిస్తే 2014లో తనను చంద్రబాబు పార్లమెంట్ కు పంపిచారని గుర్తు చేశారు. అలా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. 

తెలుగుదేశం పార్టీ కోసం ఉద్యమాలు చేశామని, లాఠీల దెబ్బలు తిన్నామని చివరికి బాబ్లీ ప్రాజెక్టు కోసం వీపులపై కొట్టించుకున్నట్లు చెప్పుకొచ్చారు. బాబ్లీ ప్రాజెక్టు కోసం వీపులు కొట్టించుకున్నది తామేనని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యింది అంటే అందుకు కారణం  కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. 80శాతం మంది కార్యకర్తలు నేతలు వెంట ఉన్నారని కానీ నేతలు మాత్రం వారి వెంట లేరని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాఖ ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలుసునన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖలో చర్చిద్దామంటే పట్టించుకునే వాడు లేడు తమ గోడు వినిపించుకునేవాడు లేడని తెలిపారు. 

ఎంతో ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 13 స్థానాల్లో పోటీ చేయడం బాధ కలిగించిందన్నారు. ఎందుకు 13 సీట్లకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. తాను గత మహానాడులో కార్యకర్తలను గుర్తించండి అని సూచించినప్పటి నుంచి కొందరు తనను ఇబ్బందులు గురి చేశారని ఆరోపించారు. 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి టికెట్లు ఇవ్వకుండా వారు గొంతు కోశారని ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అంశాలపై పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంటే తనను లోపలికి రాకుండా అడ్డుకున్నారని కంటతడిపెట్టారు.  

తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన టీడీపీ మహిళానేత శోభారాణి, పాల్వాయి రజనీకుమారిలకు తీవ్ర అన్యాయం చేశారని వారికి న్యాయం చేయాలని తెలంగాణ పార్టీ శాఖను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.    

అందువల్లే తల్లిలాంటి పార్టీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారందరికీ న్యాయం చేయాలని నడ్డాను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం యెుక్క దశదిశలను మారుస్తామని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీరని అన్యాయం చేసిన తెలంగాణ తెలుగుదేశం శాఖ కళ్లు తెరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వీడి బీజేపీలో చేరిన మహిళలకు సోదరులకు, సోదరీమణులకు న్యాయం చేసి తమ సత్తా చాటుతామని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు