భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు  పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా తెలంగాణకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తీసుకురానున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో పదాధికారులతో నడ్డా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభకు నడ్డా హాజరుకానున్నారు.

ఈ సభలో పలువురు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో నడ్డా పాల్గొంటారు.