Asianet News TeluguAsianet News Telugu

ఆ పనిలోనే అసలైన తృప్తి : అయోధ్య రామిరెడ్డి

  • లాభాలే సంతృప్తి ఇవ్వవు
  • నలుగురికి ఉద్యోగాలిస్తేనే తృప్తి
  • టెక్నో పెయింట్స్ ఆ పనిచేస్తోంది
  • సంస్థ ఉద్యోగుల బాగోగులు చూస్తేనే ఉన్నత స్థాయికి
ayodhya rami reddy participated in techno paints 15th anniversary celebrations

వ్యాపారంలో కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేది చాలా కీలకం అని రామ్‌కీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. మాధాపూర్‌ లోని ఓ హోటల్‌ లో జరిగిన టెక్నో పెయింట్స్‌ 15వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆ విధంగా తన వ్యాపారంతో పాటూ ఎక్కువమందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా సాగుతున్న టెక్నోపెయింట్స్‌ శ్రీనివాసరెడ్డి సరైన బాటలో ఉన్నారన్నారు. అది కూడా ఒకరకం సామాజిక బాధ్యతేనని చెప్పారు. అప్పు చేయకుండా నడిచేదే గొప్ప వ్యాపారం అనిపించుకుంటుందని అయోధ్య రామిరెడ్డి ప్రశంసించారు. అప్పు లేకుండా చేసే వ్యాపారంలో స్థిరత్వం ఉంటుందని, ఎలాంటి ఆందోళన లేకుండా వ్యాపారం నడిపించడం సాధ్యమవుతుందని అన్నారు.

ayodhya rami reddy participated in techno paints 15th anniversary celebrations

పెయింట్స్‌ రంగంలో సాధారణ ఉద్యోగిగా ప్రవేశించి, నేడు సుమారు 1500 మందికి ఉపాధి కల్పిస్తూ పెద్ద స్థాయికి ఎదిగిన టెక్నో పెయింట్స్‌ అధినేత శ్రీనివాసరెడ్డిని ఆయన అభినందించారు. టెక్నో పెయింట్స్‌ అధినేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సంస్థ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాలను తెలియజేశారు. చిన్న సంస్థగా మొదలై నేడు ఇంతమందికి ఉపాధి ఇచ్చేలా మారడం` ఎంతోమంది పెద్దల సహకారం వల్లనే సాధ్యమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నో పెయింట్స్‌ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

సంస్థను ఈ దశకు తీసుకురావడం అనేది కేవలం తమ ఉద్యోగులందరి సహకారం, సిబ్బంది అందరూ కూడా.. తమ బాధ్యత కేవలం ఉద్యోగమే అన్నట్లుగా కాకుండా.. తమ సొంతసంస్థలా భావించడం వల్లనే సాధ్యమైందని, వారందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... టెక్నో పెయింట్స్‌ సంస్థ ఈ స్థాయికి ఎదగడం పూర్తిగా శ్రీనివాసరెడ్డి స్వయంకృషి మాత్రమేనని అభినందించారు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు... వాటిని తట్టుకుంటూ ఇవాళ సంస్థను గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చారని... చిన్నస్థాయి ఉద్యోగాలతో జీవితాన్ని ప్రారంభించే ఎంతో మంది ఔత్సాహికులకు శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిగా నిలవగరని అన్నారు. కార్యక్రమంలో ఛానల్‌ పార్టనర్స్‌ అందరికీ జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో ఇంకా పూణేకు చెందిన మగర్‌పట్టా టౌన్‌షిప్‌ డైరక్టర్‌ మంగేష్‌ టూపే, సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ వేణు వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్నో పెయింట్స్‌ సంస్థ గురించి...

ఇవాళ దేశంలోనే అగ్రగామి పెయింట్స్‌ పరిశ్రమల్లో ఒకటిగా ఎదిగిన సంస్త టెక్నో పెయింట్స్‌. ఈ సంస్థ అధినేత శ్రీనివాసరెడ్డి తొలుత పెయింటింగ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగంతో తన వృత్తి ప్రస్థానం ప్రారంభించారు. క్రమంగా పెయింట్స్‌కు సంబంధించి ఓ సంస్థ డీలర్‌షిప్‌ తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాతి దశలో.. తానే స్వంతంగా పెయింట్స్‌ తయారీ సంస్థను ప్రారంభించే ఆలోచన చేశారు. ఆయన ఆలోచనకు శ్రేయోభిలాషుల సహకారం కూడా తోడైంది. పెయింట్స్‌ రంగంలో చిన్నస్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, ఎన్నో దశలు దాటుకుంటూ వచ్చిన వ్యక్తి కావడంతో... సంస్థ ఉద్యోగుల బాగోగుల గురించి కూడా శ్రద్ధ పెడుతూ... ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ సంస్థను నడిపిస్తూ వచ్చారు. రకరకాల సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు సంస్థను స్థిరమైన పురోగమన పథంలో ముందుకు తీసుకువెళుతున్నారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios