రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటన :ఏవో అశోక్ రెడ్డి మృతి, విద్యార్థి పరిస్థితి విషమం..
హైదరాబాద్ రామాంతపూర్ నారాయణకాలేజ్ లో జరిగిన ఓ అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన ఏవో అశోక్ రెడ్డి మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో కిచిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
హైదరాబాద్ : నారాయణ కాలేజీలో ఇటీవల జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏవో అశోక్ రెడ్డి మృతి చెందారు. ఒంటిపై ఓ యువకుడు పెట్రోల్ పోసుకోగా ప్రమాదవశాత్తు ఆయనకు కూడా నిప్పు అంటుకుంది. దీంతో ఏఓ అశోక్ రెడ్డిని కంచన్ బాగ్ లోని drdo అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన విద్యార్థి నాయకుడు సందీప్, కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..
రామంతపూర్ లోని నారాయణ కాలేజీలో ఫీజులు వివాదంపై చోటుచేసుకున్న ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. పక్కా పథకం ప్రకారమే విద్యార్థి నాయకుడు సందీప్ పెట్రోల్ తో కాలేజీలోకి ప్రవేశించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రామంతపూర్ లో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి వద్ద ప్లాస్టిక్ సీసా కొనుగోలు చేశారు. అందులో కొంత నీరు పోసి సమీపంలోని బంకులో రూ.80 విలువైన పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ బాటిల్ ను ప్యాంటు జేబులో పెట్టుకుని కళాశాలలోకి వెళ్ళాడు.
ఇల్లందులో దొంగల బీభత్సం.. సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్‌పై రాళ్ల దాడి..
విద్యా సంస్థ నిర్వాహకులను బెదిరించేందుకు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. ఆ సమయంలోనే పెట్రోలు చుక్కలు వెనుక భాగంలో దేవుడు చిత్రపటం వద్ద ఉన్న దీపంపై పడటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ముగ్గురికీ వ్యాపించడంతో.. ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటర్ విద్యార్థి సాయినారాయణ తండ్రి శేఖర్ జెసిబి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తన కుమారుడి చదువు కోసం రూ.16వేల ఫీజు బకాయి పడ్డారు. అందులో రూ.10వేలు మాఫీ చేస్తామని కళాశాల నిర్వాహకులు చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ఈలోగా నిర్వాహకులు మారారు. విద్యార్థి సాయి నారాయణ వరుసగా రెండు, మూడు రోజులు కాలేజీకి రాగా, బకాయి మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అతడు మరో విద్యార్థి మురళితో కలిసి విద్యార్థి నేత సందీప్ ను సంప్రదించారు. సందీప్ ప్రిన్సిపల్ సుధాకర్ తో మాట్లాడుతున్న క్రమంలో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు శేఖర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.