Telangana Assembly Elections 2023: తెలంగాణలో కన్నడ రాజకీయం, ఎవరికీ లాభం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అన్ని అస్త్రాలను వాడుకుంటున్నాయి. వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వదులుకోవడం లేదు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. కర్ణాటక రాజకీయాలు తెలంగాణ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో ఈ ఏడాది డిసెంబర్ 3న తేలనున్నాయి.
ఈ ఏడాది మే మాసంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ హామీలను అమలు చేయలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తమ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది.ఈ గ్యారంటీలకు తోడుగా మరికొన్ని హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. పార్టీలో చేరికలు ,ఇతర వ్యవహరాలపై డీకే శివకుమార్ ప్రధాన భూమిక పోషించారు.
అయితే కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ కోసం రైతుల పోరాటం గురించి మీడియాలో వచ్చిన వార్తలను భారత రాష్ట్ర సమితి నేతలు ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో మొసలిని తెచ్చి రైతులు నిరసన చేసిన అంశాన్ని మంత్రి కేటీఆర్ తన ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత నెలలో గద్వాల, కొడంగల్ తో పాటు కర్ణాటకకు సమీపంలోని నియోజకవర్గాల్లో కర్ణాటక రైతులు ఆందోళనలు నిర్వహించారు. కర్ణాటకలో తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కొడంగల్ లో కర్ణాటక రైతులతో కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగాయి. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. అయితే తాము కూలీకి వచ్చినట్టుగా కర్ణాటక రైతుల పేరుతో వచ్చిన వారు చెప్పారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రచారానికి ఎదురు దాడి చేస్తున్నారు.
హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి, ఆ పార్టీ శ్రేణులు వారితో గొడవకు దిగారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇంటి ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు వారికి సూచించారు.
also read:karnataka farmers హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా: అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని కర్ణాటకకు వస్తే నిరూపిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్ర అంశాలు ప్రచార అంశంగా మారాయి. ఈ ప్రచారం ఏ పార్టీకి కలిసి వస్తుందనే విషయం ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.