Vijayashanti : జనసేన వల్లే రాములమ్మ బిజెపిని వీడారా? రాజీనాామాపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి పవన్ కల్యాణ్ జనసేనతో పొత్తే కారణం అనేలా విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపికి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఆమె బిజెపికి, పోటీకి దూరంగా వుండటంతో విజయశాంతి పార్టీ మార్పు ప్రచారం జరిగింది. ఇదే నిజమై ఆమె బిజెపికి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు విజయశాంతి తెలిపారు.
అయితే బిజెపికి రాజీనామా చేయడానికి పవన్ కల్యాణ్ తో పొత్తే కారణమనేలా కామెంట్స్ చేసారు రాములమ్మ. తరతరాలుగా స్వరాష్ట్రం కోసం పోరాటంచేసిన మా ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఆమోదించరని విజయశాంతి పేర్కొన్నారు. ప్రాంతేతర పార్టీలకు అధికారాన్ని అప్పగించేందుకు తెలంగాణ బిడ్డలు అస్సలు అంగీకరించరని... అందువల్లే అనేకసార్లు అలాంటి పార్టీలను వ్యతిరేకించారని అన్నారు. కాబట్టి ప్రాంతేతర పార్టీల రాజకీయాలు తెలంగాణలో చెల్లవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు విజయశాంతి.
అయితే ప్రాంతేతర పార్టీలను, ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చి హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సెటిలైన వారిని ఒకే గాటన కట్టడం సరికాదని విజయశాంతి అన్నారు. ఈ ప్రాంతంలో వుంటున్నవారు ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు... కానీ ప్రాంతేతర పార్టీలను కలుపుకుపోయేందుకు తెలంగాణ బిడ్డలు సిద్దంగా లేరన్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి అర్థమయ్యే ఎన్నికలకు దూరంగా వుంటోందని అన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు బిఆర్ఎస్ కూడా దూరంగా వుండటానికి కారణం ఇదేనని విజయశాంతి అన్నారు.
తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు... ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలేనని విజయశాంతి అన్నారు. తమ రాష్ట్రానికి వచ్చిన ప్రజల ప్రయోజనాలు, భధ్రత ఆ ప్రాంత ప్రజలు కాపాడి తీరాలన్నారు. కానీ ప్రాంతేతర పార్టీల విషయంలో మాత్రం ఆ ఆలోచన సరికాదన్నారు. పార్టీల ప్రయోజనాలు వేరు... ప్రజా ప్రయోజనాలు వేరని విజయశాంతి అన్నారు.
ఏ ప్రాంతం వారైనప్పటికీ భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి అన్నారు. అందుకే కోవిడ్ కష్టకాలంలో ఏపీ నుండి అంబులెన్స్‌లను హైదరాబాద్ కు రానివ్వకుండా అడ్డుకుంటే వారిని తక్షణమే వదలాలని...లేదంటే ఎంతటి కోట్లాటకైనా సిద్దమేనని హెచ్చరించినట్లు రాములమ్మ తెలిపారు. ఇలా అక్కడి ప్రజల కోసం ఏమయినా చేస్తాం కానీ అక్కడి పార్టీల కోసం కాదు అంటూ పరోక్షంగా తెలంగాణ బిజెపి జనసేనతో పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు విజయశాంతి.