బిజెపిని వీడతారంటూ జోరుగా ప్రచారం... ఎట్టకేలకు విజయశాంతి క్లారిటీ
బిజెపి కార్యక్రమాలకు దూరంగా వుంటున్న విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా రాములమ్మ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై బిజెపి అభ్యర్థి అన్నారు... ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అన్నారు... ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి కీలక పాత్ర పోషించనున్నారంటూ రాజకీయ ప్రచారం జరిగింది. కానీ అటు అభ్యర్థిగానే కాదు ఇటు క్యాంపెయినర్ గానూ ఆమెకు అవకాశం దక్కకపొవడం పలు అనుమానాలకు దారితీసింది. బిజెపిలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తితో వున్నారని... తన రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో విజయశాంతి కూడా బిజెపిని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా తెరదించారు విజయశాంతి.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పిఎఫ్ అధినేత మందకృష్ణ మాదిగ ఆహ్వానం మేరకు నిన్న(శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు విచ్చేసారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని పాల్గొన్నారు. చాలారోజులుగా బిజెపి కార్యక్రమాలకు దూరంగా వుంటున్న విజయశాంతి కూడా ఈ సభలో పాల్గొన్నారు. అంతేకాదు ప్రధాని పాల్గొన్న సభ సాక్షిగా తాను బిజెపిని వీడటంలేదని రాములమ్మ స్పష్టం చేసారు.
ఇదిలావుంటే విజయశాంతి పార్టీ మారడానికి ప్రయత్నించారని... బిజెపి అధినాయకత్వం సముదాయించడంతో ఆమె వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాల్లో మరో చర్చ మొదలయ్యింది. ఆమెకు పార్టీ మారే ఆలోచనే లేకుంటే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ ఎందుకు మౌనంగా వున్నారు... మల్లు రవి వంటి సీనియర్ నాయకులు ఆమె కాంగ్రెస్ లో చేరతారని బహిరంగంగా మాట్లాడతారు... అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల వేళ విజయశాంతి బిజెపిని వీడితే మరింత డ్యామేజ్ జరిగే అవకాశాలుండటంతో ఆ పార్టీ పెద్దలు సముదాయించినట్లు తెలుస్తోంది.
Read More కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి షాక్: రాజీనామా, బీఆర్ఎస్ లో చేరిక
విజయశాంతి బిజెపిలో చేరుతున్నారని మల్లు రవి ప్రకటించిన రోజే విజయశాంతి ప్రధాని మోదీ సభకు హాజరవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. బిజెపిని దెబ్బతీసేందుకే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని బిజెపి నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే విజయశాంతి పార్టీ మారనున్నారంటూ ప్రచారాన్ని లేవనెత్తారని... దానికి చెక్ పెట్టేందుకు ఆమె ప్రధాని మోదీని కలిసారని బిజెపి నాయకులు చెబుతున్నారు.