Revanth Reddy:పదేళ్లు బీఆర్ఎస్‌కిచ్చారు, ఒక్క అవకాశమివ్వాలి

ఎన్నికల ప్రచారంలో ప్రజలను తమ వైపునకు ఆకర్షించేందుకు  పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు  రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

TPCC Chief Revanth Reddy urges people to give one time  chance  to Congress in Telangana lns

వనపర్తి:పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు.. ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.చిన్నారెడ్డి  తనకు  పెద్దన్నలాంటి వారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. 

మంగళవారంనాడు వనపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల సభలో  రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో వనపర్తికి ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. 1952లో సురవరం ప్రతాప్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 1959లో ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజి ప్రారంభించారన్నారు. తాను  చదువుకుంది వనపర్తిలోనే ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే తనకు  ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. 

కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకుంటే వారి శిష్యుడు నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. అభివృద్ధిలో ముందుండాల్సిన వనపర్తికి నిరంజన్ రెడ్డి చెడ్డపేరు తెచ్చారన్నారు.వనపర్తి ఎమ్మెల్యే అంటే అత్యంత అవినీతిపరుడనే ముద్ర పడిందని ఆయన ఆరోపించారు. మన అభివృద్ధి,మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందని రేవంత్ రెడ్డి  చెప్పారు.వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా మీరు నిర్ణయం తీసుకోవాలని  రేవంత్ రెడ్డి  కోరారు. 

కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్  చేస్తున్న  ప్రచారం గురించి  రేవంత్ రెడ్డి  ప్రస్తావిస్తూ చింతమడకకు రోడ్డు,సిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న  డిగ్రీ కాలేజి కట్టింది  కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినా కేసీఆర్ కుటుంబానికి మినహా ఎవరికీ ప్రయోజనం కలగ లేదన్నారు. కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయన్నారు.కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత కలలు నెరవేరాయి తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదని రేవంత్ రెడ్డి  విమర్శించారు.

కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.పంచె కట్టుకుని నిరంజన్ రెడ్డి తనకు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుకుంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. లాల్చీ వేసుకున్న ప్రతీ వాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదన్నారు.

 

2018 నుంచి 2021 వరకు 83వేల మందికి రైతుబీమా ఇచ్చామని నిరంజన్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మూడేళ్లలో 83వేల మంది రైతులను పొట్టన పెట్టుకుంది కేసీఆర్ సర్కార్ అని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  తెలంగాణ వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

also read:N.T.Rama Rao పేరుతో కేసీఆర్: కాంగ్రెస్ ఇందిరా గాంధీ ప్రచారానికి చెక్

ఇందుకు  ఈ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకే కాంగ్రెస్ రైతు భరోసా పథకం ప్రకటించిందని రేవంత్ రెడ్డి  చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios