N.T.Rama Rao పేరుతో కేసీఆర్: కాంగ్రెస్ ఇందిరా గాంధీ ప్రచారానికి చెక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేరును ఉపయోగించుకుంటుంది. అయితే కాంగ్రెస్ తెచ్చిన ఇందిరా గాంధీ పేరుకు నందమూరి తారక రామారావు పేరును భారత రాష్ట్ర సమితి తెరమీదికి తెచ్చింది. ఈ రెండు పార్టీల నేతలు ఈ ఇద్దరు నేతల పేర్లను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్ కౌంటర్లు, నక్సలైట్లు, ఆకలి కేకలేనా అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు నందమూరి తారక రామారావు పేరును కూడ ఆయన తెరమీదికి తెచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది మాసాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర నందమూరి తారక రామారావుది. నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను కూడ అమలు చేశారు. రెండు రూపాయాలకు కిలో బియ్యం పథకాన్ని ఎన్ టీ ఆర్ ప్రారంభించారు.ఇప్పటికీ కూడ ఈ పథకం కొనసాగుతుంది. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. మహిళలకు ఆస్తిలో వాటా వంటి సంచలన నిర్ణయాలకు ఎన్ టీ ఆర్ కారణమయ్యారు.
ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటుంది. ఇందిరా గాంధీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పట్లో అండగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ నుండి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ఇందిరా గాంధీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అండగా అప్పట్లో నిలిచింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఆమె కొంత అభిమానంగా ఉండేవారని అప్పటి కాంగ్రెస్ నేతలు చెబుతుండేవారు.
తమ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై కేసీఆర్ ఎదురు దాడికి దిగుతున్నారు. ఇందిరమ్మ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఉక్కు మహిళగా ఇందిరా గాంధీకి పేరుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఉద్యమాలను ఇందిరా గాంధీ అణచివేశారని ఆమె ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించిన విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.
also read:తెలంగాణ ఎన్నికల్లో N.T. Rama Rao పేరు: కేసీఆర్ వాడడం వెనుక వ్యూహమిదే.
బలమైన ఇందిరా గాంధీ నాయకత్వాన్ని కూడ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అధికారాన్ని దక్కించుకున్నారు నందమూరి తారక రామారావు. తెలంగాణ రాష్ట్రంలోని 40 నుండి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రాంతం నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ఓటర్లుంటారు. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములను సీమాంధ్ర ఓటర్లు ప్రభావితం చేస్తారు.
also read:nakrekal assembly segmentలో సీపీఐ(ఎం)దే ఆధిపత్యం: మూడు దఫాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో తెలంగాణలో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులు ఆందోళన చేశారు.ఈ విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా కలకలం రేపాయి.అయితే ఆ తర్వాత ఈ విషయమై బీఆర్ఎస్ వెనక్కు తగ్గింది. చంద్రబాబు అరెస్ట్ ను తప్పు బట్టారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి హరీష్ రావు ఈ విషయంలో స్పందించారు. హరీష్ రావు కంటే ముందు కొందరు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని వారి వ్యక్తిగతమైనవిగా కేటీఆర్ ప్రకటించారు.
also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ..
ఎన్నికల ప్రచారంలో ఇందిరమ్మ రాజ్యమంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ఎన్టీఆర్ పేరును తెరమీదికి తెచ్చి బీఆర్ఎస్ చెక్ పెడుతుంది. ఎన్టీఆర్ పేరును వాడుకోవడం ద్వారా తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లను తిరిగి తమ వైపునకు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు