2004 నుండి సిద్దిపేట నుండి హరీష్ రావు వరుస విజయాలు: 2018లో రికార్డు మెజారిటీ

సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుండి  ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటున్నారు హరీష్ రావు.  2004 నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో  హరీష్ రావు  మెజారిటీ పెరుగుతుంది.

 Thanneeru Harish Rao broke his own records in Siddipet Assembly segment lns


హైదరాబాద్:  సిద్దిపేట అసెంబ్లీ స్థానంనుండి  ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటున్నాడు తన్నీరు హరీష్ రావు. మరోసారి ఇదే అసెంబ్లీ స్థానం నుండి హరీష్ రావు  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి  తన్నీరు హరీష్ రావు  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా  మరోసారి బరిలోకి దిగుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన    ఉప ఎన్నిక ద్వారా సిద్దిపేట నుండి హరీష్ రావు తొలిసారిగా  అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుండి హరీష్ రావు  వెనుదిరిగి చూసుకోలేదు.  2004 అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ స్థానం నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  విజయం సాధించారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి  కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో  జరిగిన ఉప ఎన్నికల్లో  హరీష్ రావు  విజయం సాధించారు. 

తెలంగాణ సాధన కోసం  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  రాజీనామాలు సమర్పించారు.దీంతో  2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుండి హరీష్ రావు విజయం సాధించారు.  2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడ  హరీష్ రావు  విజయం సాధించారు.  2010లో జరిగిన  ఉప ఎన్నికల్లో  మరోసారి  హరీష్ రావు గెలుపొందారు.2014, 2018 ఎన్నికల్లో కూడ హరీష్ రావు ఇదే అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందారు.

2004 ఉప ఎన్నికల్లో హరీష్ రావుకు  64,376 ఓట్లు  వచ్చాయి. టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన  చెరుకు ముత్యం రెడ్డికి  39,547 ఓట్లు వచ్చాయి. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో  హరీష్ రావుకు  76,270 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి రవీందర్ రెడ్డికి 16,494 ఓట్లు మాత్రమే దక్కాయి. 59,776 ఓట్ల మెజారిటీ హరీష్ రావుకు వచ్చింది.

2009 సాధారణ ఎన్నికల్లో హరీష్ రావుకు 85,843 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి బైరి అంజయ్యకు 21,166 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు  64,677 ఓట్ల మెజారిటీ దక్కింది.

2010లో  జరిగిన ఉప ఎన్నికల్లో  1,08,779 ఓట్లు హరీష్ రావుకు వచ్చాయి.తన సమీప ప్రత్యర్ధి తాడూరు శ్రీనివాస్ గౌడ్ కు  12,921 ఓట్లు దక్కాయి. దీంతో ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు  95,858 ఓట్ల మెజారిటీ వచ్చింది.

2014లో హరీష్ రావుకు  1,08, 699 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి  తాడూరి శ్రీనివాస్ గౌడ్ కు  13,003 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు  95,696  ఓట్ల మెజారిటీ దక్కింది. 2010 ఉప ఎన్నికలతో పోలిస్తే  మెజారిటీ స్వల్పంగా తగ్గింది.

2018 ఎన్నికల్లో హరీష్ రావుకు  1,31,295 ఓట్లు వచ్చాయి.  తెలంగాణ జనసమితి అభ్యర్ధి  భవానీ మరికంటికి  12,596 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో హరీష్ రావు  మెజారిటీ  1,18, 699 వచ్చింది.

ప్రతి ఎన్నికల్లో కూడ హరీష్ రావు తన మెజారిటీని పెంచుకుంటున్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు  నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు ప్రజల  కష్ట సుఖాల్లో ఆయన వెన్నంటి ఉంటారు. అందుకే  హరీష్ రావు ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

also read:తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు మాయం: పాలకుర్తి సభలో కేసీఆర్

అధికారంలో లేని సమయంలో  కూడ తన నియోజకవర్గంలో అభివృద్ది కోసం  ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగి నిధులను మంజూరు చేయించుకొనేవారు హరీష్ రావు. గత రెండు దఫాలుగా కేసీఆర్ మంత్రివర్గంలో హరీష్ రావుకు చోటు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కూడ  హరీష్ రావు మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

2023 ఎన్నికల్లో  కూడ  హరీష్ రావు మరోసారి సిద్దిపేట నుండి బరిలోకి దిగుతున్నారు.  ఈ దఫా సిద్దిపేట ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారో  వచ్చే నెల మూడున తేలనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios