Telangana Elections: నా మాట విని ఓటు వేయనందుకు థాంక్స్: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాట విని ఓటర్లు ఓటు వేయనందుకు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ రోజు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాలేదని తెలిపారు.
హైదరాబాద్: ఎన్నికలు వస్తున్నాయంటే పౌరులందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు ప్రోత్సహిస్తుంటారు. ఓట్ల పండుగ.. ప్రజాస్వామ్య పండుగ అని చెబుతారు. ఈ రోజు కూడా ఓటు వేసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు.. ఇతర పౌరులూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కానీ, ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీకి అనుమతి ఇవ్వలేదని, మునుగోడు బైపోల్‌నూ తమకు ఇదే పరిస్థితి ఎదురైందని కేఏ పాల్ అన్నారు. అందుకే తాను ఓటు వేయవద్దని ఓటర్లకు పలుమార్లు పిలుపు ఇచ్చానని గుర్తు చేశారు. అందుకే ఈ రోజు తన మాట విని ఓటు వేయనందుకు ధన్యవాదాలని అన్నారు.
Also Read : Telangana Polling: మారని హైదరాబాద్ వాసుల తీరు.. అన్ని జిల్లాల్లోకెల్లా అత్యల్పంగా పోలింగ్ శాతం
కేఏ పాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 79 శాతం ప్రజలు ప్రజా శాంతి పార్టీని కోరుకుంటున్నారని, కానీ, ఎన్నికల అధికారులు మాత్రం తన పార్టీ ఇనాక్టివ్ అని చెప్పి పోటీకి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు. తాము పోరాడితే ఐదు సీట్లలో రింగు గుర్తు ఇచ్చారని వివరించారు. ఈ కారణంగానే తాను ఓటర్లు ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చినట్టు చెప్పారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, ఓటు వేయొద్దని చెప్పానని అన్నారు. ఒక వేళ ఓటు వేయాలని అనుకున్నా.. తనలా నోటాకు ఓటు వేయాలని సూచనలు ఇచ్చారు. ఈ రోజు ఎవరూ ఓటు వేయడానికి రాలేదని, తన మాట విన్నందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.