Telangana Polling: మారని హైదరాబాద్ వాసుల తీరు.. అన్ని జిల్లాల్లోకెల్లా అత్యల్పంగా పోలింగ్ శాతం
హైదరాబాద్‌లో పోలింగ్ శాతంలో పెద్దగా మార్పు కనిపించేలా లేదు. గతంలోనూ అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైన జిల్లా హైదరాబాదే. ఈ సారి కూడా ఇదే తీరు కొనసాగించేలా ఉన్నది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సగటు పోలింగ్ శాతం 52 ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం 32 శాతమే నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్: ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలంతా పోలింగ్ కేంద్రాల చుట్టే కనిపిస్తున్నారు. వేరే ఊళ్లు, పట్టణాలలో ఉన్నవారు సైతం సొంతూరికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ, హైదరాబాద్ పరిస్థితి మాత్రం మారలేదు. పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతున్నది. మధ్యాహ్నం వరకైతే ఇక్కడ పోలింగ్ అంతంతగానే ఉన్నది. ముఖ్యంగా టెకీలు, సంపన్నులు ఎక్కువగా ఉండే జూబ్లిహిల్స్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లో సగటున 21 శాతం పోలింగ్ నమోదైంది. సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ పోలింగ్ శాతం 32 శాతం రిజిస్టర్ అయింది. అదే అత్యధికంగా మెదక్‌లో 71 శాతం నమోదైంది.
2018లోనూ హైదరాబాద్‌లోనే అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. చాలా జిల్లాల్లో 80 శాతానికి పైగా రికార్డ్ కాగా.. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఇది 50 శాతానికే పరిమితమైంది. ఈ సారి కూడా ఈ పరిస్థితి మారేలా లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు 31.60 శాతం మాత్రమే నమోదైంది. 3 గంటలకు రాష్ట్ర సగటు పోలింగ్ శాతం 52 ఉండగా.. ఈ యావరేజీకి తక్కువగానే హైదరాబాద్‌లో నమోదైంది.
Also Read: Telangana Election Result: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టే టైమ్ ఇదే..!
హైదరాబాద్‌లోనే సినీ ప్రముఖులు, ప్రముఖ రాజకీయ నేతలూ ఓటు వేశారు. ఎక్కువ మంది ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. ఎన్నికల సంఘం కూడా నగర వాసులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంది. పెయిడ్ లీవ్‌గా ప్రకటించాలని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ఐటీ కంపెనీలూ కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఈసీ నొక్కి చెప్పింది. కానీ, ప్రైవేటు కంపెనీల ఎంప్లాయీస్, ముఖ్యంగా టెకీలు ఓటు వేయడానికి విముఖంగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ సెలవు రోజునా ఇంటి వద్దే వాళ్లు గడుపుతున్నట్టు స్పష్టం అవుతున్నది. ఈ సారి కూడా వారి ధోరణిలో మార్పు లేదని తెలుస్తున్నది. ఈ మాత్రం ఓటింగ్ కూడా ఆయా ప్రాంతాల్లోని బస్తీ వాసులు ఓటు వేయడం ద్వారానే నమోదైందని కొందరు చెబుతున్నారు.