Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హంగ్ వస్తుందని తెలిపింది. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లను గెలుచుకుంటుందని వివరించింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన విషయం తెలియవచ్చింది. తెలంగాణలో హంగ్ వస్తుందని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ అనూహ్యంగా విజృంభించినా మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ తప్పదని ఈ సర్వే చెప్పింది.
సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పింది. బీజేపీకి 10 సీట్లు, ఎంఐఎంకు 5 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.
తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 స్థానాలు అవసరం. కానీ ,ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి కూడా మెజార్టీ మార్కు దాటడం లేదు. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఓటు శాతాన్ని కూడా గణనీయంగా మెరుగుపరుచుకున్నట్టు ఈ సర్వే ద్వాారా తెలుస్తున్నది. అయితే.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. బీఆర్ఎస్‌కు 48 సీట్లు వచ్చినా.. ఎంఐఎం ఈ పార్టీకి మద్దతును ముందుగానే ప్రకటించింది. దీంతో మొత్తంగా 53 స్థానాలు బీఆర్ఎస్ వైపు ఉన్నా.. ఇంకా మెజార్టీ మార్కుకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. దీంతో బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. దీంతో బీఆర్ఎస్‌తో బీజేపీ కలిసిపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.