Telangana Elections 2023 : కేసీఆర్ ప్రచారానికి వెదర్ బ్రేక్... హైదరాబాద్ లో బిఆర్ఎస్ సభ రద్దు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఇలా హైదరాబాద్ లో భారీగా నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభకు వర్షం అడ్డంకిగా మారింది.
హైదరాబాద్ : మరో వారంరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. నవంబర్ 30న తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అంతకు ముందే పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఏం ప్రచారం చేసినా ఈ రెండుమూడు రోజులే. ఇలాంటి కీలక సమయంలో ఎన్నికల ప్రచార జోరు పెంచిన పార్టీలకు వాతావరణం అడ్డు తగులుతోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి... మరో రెండురోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం వుందనేది వాతావరణ సమాచారం. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయ్యింది.
రోజుకు రెండుమూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలను చుట్టేసిన కేసీఆర్ ఇక హైదరాబాద్ పై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్దమయ్యారు. కానీ మరో రెండ్రోజులపాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ఈ సభను రద్దుచేస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది.
ఇక ఈ వర్షాలు ఇతర పార్టీల ప్రచారానికి కూడా ఆటంకంగా మారింది. కాంగ్రెస్, బిజెపిల తరపున ఈ రెండుమూడు రోజులు ముమ్మర ప్రచారం చేపట్టేందుకు జాతీయ నాయకులు సిద్దమయ్యారు. ఇవాళ అమిత్ షా,రాహుల్ గాంధీలతో పాటు మరికొందరు జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇలా తెలంగాణలో స్థానిక, జాతీయ నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా అకాల వర్షం అడ్డుతగులుతోంది. ఈ వర్షాల కారణంగా కేసీఆర్ సభ మాత్రమే కాదు ఇతర పార్టీల సభలు, ప్రచార కార్యక్రమాలు రద్దయ్యే అవకాశాలున్నాయి.