ఆ పార్టీలో 12 మంది సీఎంలు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే , నా పదేళ్ల కష్టం వృథాయే : కేసీఆర్ వ్యాఖ్యలు
ఇందిరమ్మ రాజ్యంలో 400 మందిని కాల్చి చంపారని ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. పదేళ్లు తాను పడిన కష్టం వృథా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ రాజ్యంలో 400 మందిని కాల్చి చంపారని ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే వుందని, ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరస్థితులు వుండేవని.. ఆ సమయంలో ఏ వర్గంలోని ప్రజలు కూడా బాగుపడలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ చురకలంటించారు.
రూ.200 వున్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రైతు రాజ్యం వుందని. మూడేళ్ల కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. కౌలుదారుడు రెండు, మూడేళ్లు సాగు చేస్తే రైతు భూమి గోల్ మాల్ అవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. పదేళ్లు తాను పడిన కష్టం వృథా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని.. ఆ పార్టీలో 12 మంది సీఎంలు వున్నారని కేసీఆర్ సెటైర్లు వేశారు.
అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా అని అన్నారు. ఐటీ రైడ్ లు కాంగ్రెస్ నాయకులపై మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పడం వాస్తవం కాదని అన్నారు. రాష్ట్రానికి స్వీయ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నవంబర్ 29వ తేదీన దీక్షా దినాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ దీక్షతోనే నవంబర్ 29న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కీలక ప్రకటన చేసిందని చెప్పారు.
ALso Read: రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా ? కర్ణాటకలో ఒక్క జాబ్ నోటిఫికేషనైనా ఇచ్చారా ?- మంత్రి కేటీఆర్
ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎక్కడి వారు అక్కడ ఈ దీక్షా దినాన్ని జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. హాస్పిటల్స్ లో పేషంట్లకు పండ్లు పంపిణీ చేయాలని, ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. కోరుట్ల, గోషామహల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండియేట్ లను నిలబెట్టిందని ఆయన ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే ప్రేమ అని అన్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండియేట్ ను బీఆర్ఎస్ ఓడిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిన పథకం కాదని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న స్కీమ్ లకు ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన అన్నారు.