తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వానికి గడువు ముగిసింది. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్దమని.. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధమన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని, స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాలని సూచించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వానికి గడువు ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సైలెంట్ పీరియడ్ మొదలైందన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని, స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాలని సూచించారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని.. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు వెళ్తారని వికాస్ రాజ్ చెప్పారు.

మాక్ పోల్ కోసం ఎల్లుండి ఉదయం 5.30 కల్లా పోలింగ్ ఏజెంట్లు రావాలని.. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోకూడదని ఆయన పేర్కొన్నారు. తొలిసారి హోం ఓటింగ్ చేశామని.. 27 వేల 178 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని.. 27,097 పోలింగ్ స్టేషన్‌లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. 

ALso Read: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలపై ఈసీ సమీక్ష

119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారని వికాస్ రాజ్ చెప్పారు. ఈసారి ఎన్నికల బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ వున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు వున్నారని.. వారిలో కోటి 63 లక్షల 1,705 మంది మహిళా ఓటర్లు, కోటి 62 లక్షల 92 వేల 418 మంది పురుష ఓటర్లు వున్నారని వికాస్ రాజ్ తెలిపారు. అలాగే 2,676 మంది ట్రాన్స్‌జెండర్లు వున్నారని.. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

12 వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. 9 లక్షల 99 వేల 667 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వికాస్ రాజ్ చెప్పారు. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదని ఆయన ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని తెలిపారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్దమని.. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధమన్నారు. సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచార నిషిద్ధమని.. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఇస్తామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు వుండకూడదని ఆయన వెల్లడించారు.