Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలపై ఈసీ సమీక్ష
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షిస్తుంది. వర్చువల్ గా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళవారంనాడు పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. నగదు, లిక్కర్ ప్రభావాన్ని అరికట్టే విషయంలో ఏం రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చించారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 36 వేల ఈవీఎంలను కూడ సిద్దం చేశారు. పోలింగ్ కేంద్రాలకు 59,775 బ్యాలెట్ యూనిట్లను సిద్దం చేశారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. దీంతో రాష్ట్ర పోలిస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను కూడ రంగంలోకి దించారు. 375 కంపెనీల పారా మిలటరీ బలగాలు రాష్ట్రంలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో 4,400 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్టుగా అధికారులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు సిబ్బందిని నియమించారు.