ఈసీ నోటీసు.. కేటీఆర్ ఇంకా స్పందించలేదు , ఏకే గోయల్ ఇంట్లో ఏం దొరకలేదు : సీఈవో వికాస్ రాజ్ ప్రకటన
ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా స్పందించలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏం దొరకలేదని వికాస్ రాజ్ ప్రకటించారు.
ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా స్పందించలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, ఘర్షణలు, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై తాము వెంటనే స్పందిస్తున్నామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పది విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిలో 9కి ఆమోదముద్ర వేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రూ.7 వందల కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామని.. మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏం దొరకలేదని వికాస్ రాజ్ ప్రకటించారు.
కాగా.. కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమీషన్ తన నోటీసుల్లో పేర్కొంది. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకున్నారని సూర్జేవాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాని నోటీసుల్లో కేటీఆర్‌ను కోరింది.
ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కేటీఆర్‌పై కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అజయ్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు జి . నిరంజన్, అధికార ప్రతినిధి రాంచంద్రారెడ్డిలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు.