Telangana Election Results: వాస్తుతో ‘ఫలితాలు’ వచ్చేనా? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు!
ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేసినట్టు తెలిసింది. ఫలితాలు మెరుగ్గా రావాలనే ఉద్దేశంతో వాస్తు మార్పులు చేసినట్టు కథనాలు వస్తున్నాయి.
హైదరాబాద్: ఎన్నికలు ముగిశాక అన్ని పార్టీల చూపు ఫలితాలపైనే ఉన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అధికారాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉండగా బీజేపీ, ఎంఐఎంలు కింగ్ మేకర్‌లం మేమే అనే విశ్వాసంతో ఉన్నాయి. కింగ్ మేకర్లు కొన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎంఐఎంకు ఆరు లేదా ఏడు సీట్లకు మించి గెలిచే స్కోప్ లేదు. కానీ, బీజేపీ పరిస్థితి వేరు. ఆ పార్టీ సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ వరకూ సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తమ ప్రయత్నాలు ముగిశాయి.. ఇక భారం దైవంపైనే అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది.
అందుకే ఈ దిశగానే బీజేపీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వాస్తు మార్పులు చేసినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే తూర్పు ద్వారాన్ని మూసి ఉత్తర ద్వారం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి.
Also Read: CM KCR: కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చినా 4న కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా?
గతంలోనూ రాష్ట్ర బీజేపీ ఇలాంటి మార్పులు చేసిన చరిత్ర ఉన్నది. ఈ సారి ఎన్నికల ఫలితాల ముంగిట్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మరి ఈ వాస్తు మార్పు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ఉంటుందనేది డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. సైన్స్‌ను విశ్వసించే వారు వాస్తును నమ్మరు. అదొక మూఢ నమ్మకం అంటారు. కొందరు మాత్రం వాస్తును విశ్వసిస్తారు.