Seethakka : ఫోటో వివాదం... అర్థరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన
పోలింగ్ సమయంలో ఉపయోగించే ఈవిఎం బ్యాలెట్ పత్రాల ముద్రణపై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ బ్యాలెట్ ప్రతాలను ఉపయోగించడానికి వీల్లేందంటూ ఆమె ఆందోళనకు దిగారు.
ములుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పోరాడుతున్నాయి. తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయంటే అది ఎంత చిన్న విషయమైనా అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు అభ్యర్థులు. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యే, ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క బ్యాలెట్ పేపర్లో తన ఫోటోను చిన్నగా ముద్రించారంటూ ఆందోళన దిగారు. తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్థరాత్రి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సీతక్క.
పోలింగ్ సమయంలో ఉపయోగించే ఈవిఎం బ్యాలెట్ పత్రాల్లో మిగతా అభ్యర్థుల కంటే సీతక్క ఫోటో చిన్నగా వుందట. ఇది గమనించిన కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆమె ఎందుకిలా తన ఒక్క ఫోటో మాత్రమే చిన్నగా వుందని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. కానీ వారినుండి సరైన సమాధానం రాకపోవడంతో సీతక్క ఆందోళనకు దిగారు.
అర్ధరాత్రి ములుగు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు సీతక్క. వెంటవచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న రిటర్నింగ్ అధికారి అంకిత్ సీతక్కతో మాట్లాడారు. నామినేషన్ సమయంలో ఇచ్చిన ఫోటో వల్లే ఇలా జరిగిందని... ఉద్దేశపూర్వకంగా చిన్నగా ముద్రించలేదని తెలిపారు. ఈవిఎం బ్యాలెట్ పత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరో ఫోటో ఇస్తే మారుస్తామని రిటర్నింగ్ అధికారి సీతక్కను సముదాయించారు.
Read More Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ తగ్గట్లేదుగా... నేడు హస్తంగూటికి మరో మాజీ ఎమ్మెల్యే
అయితే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాన్ని మారుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేరంటూ సీతక్క ఆందోళనను కొనసాగించారు. ఇలా అర్ధరాత్రి 2గంటల వరకు సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దే ఆందోళన కొనసాగించారు.