Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ తగ్గట్లేదుగా... నేడు హస్తంగూటికి మరో మాజీ ఎమ్మెల్యే
బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించగానే బిజెపి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇతర పార్టీలనుండి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది... నామినేషన్ల ప్రక్రియ పూర్తయి పోలింగ్ కు పదిరోజుల సమయమే వుంది... ఇలాంటి సమయంలోనూ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతూనేవున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు... కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ భవిష్యత్ బావుటుందనేది ఆ పార్టీలో చేరుతున్న నాయకుల ఆశ. ఇలా గతంలో కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం రెండు నెలల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని... ఇలాంటి పరిస్థితిలో పార్టీలో వుండలేకపోతునంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా లేఖ రాసారు. ఇలా చాలారోజుల క్రితమే బిజెపిని వీడిన మృత్యుంజయం ఏ పార్టీలో చేరకుండా వున్నారు. అయితే సన్నిహితులు, అనుచరుల కోరిక మేరకు తిరిగి సొంతగూటికి చేరేందుకు ఆయన సిద్దమయ్యారు. ఇవాళ మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఏఐసిసి ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో మృత్యుంజయం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఈరోజు 12 గంటలకు ఈ చేరిక కార్యక్రమం వుండనుంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు ముందు కూడా చేరికలు కొనసాగుతుండటం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతోంది. ఇప్పటికే విజయంపై ధీమాతో వున్న కాంగ్రెస్ నాయకులు తాజా చేరికలతో తమ విజయావశాలు మరింత మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
1981లో రాజకీయాల్లోకి వచ్చిన కటుకం మృత్యుంజయం తొలుత గంభీరావుపేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా పనిచేశాడు. 1983 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనర్ నియోజకవర్గం నుంచి సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి 1992 నుంచి 1995 వరకు గంభీరావుపేట సింగిల్ విండో ఛైర్మన్‌గా పనిచేశారు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకర బ్యాంక్ ఛైర్మన్‌గానూ సేవలందించారు. అయితే 2020 మార్చిలో డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి అదే ఏడాది జూన్‌లో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.