Bandaru Vijayalakshmi : బిఆర్ఎస్ నాయకులతో గవర్నర్ దత్తాత్రేయ కూతురు... అసలేం జరిగింది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు అన్నిపార్టీల నాయకులు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచార గడువు మరో ఏడెనిమిది రోజులతో ముగియనుండటంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఓటేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని ముషిరాబాద్ నియోజకవర్గంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది.
మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసం ముషీరాబాద్ పరిధిలో వుంది. మాజీ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ ఇళ్లున్న గల్లీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇలా ప్రతిఇంటికి వెళుతూ బిజెపి మాజీ జాతీయాధ్యక్షుడు దత్తాత్రేయ ఇంటికి కూడా వెళ్ళారు. ఈ సమయంలో ఇంట్లో ఆయన కూతురు విజయలక్ష్మి కనిపించారు. ఆమెకు బిఆర్ఎస్ పార్టీ కరపత్రం అందిస్తూ ఫోటోలు దిగారు నాయకులు. ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కు ఓటేయాలని విజయలక్ష్మిని కోరారు బిఆర్ఎస్ నాయకులు.
Read More Seethakka : ఫోటో వివాదం... అర్థరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన
ముషీరాబాద్ బిజెపి టికెట్ ను విజయలక్ష్మి ఆశించారు... కానీ అదిష్టానం ఆమెకు మొండిచేయి ఇచ్చింది. టికెట్ కోసం ప్రయత్నించిన ఆమెకు కాకుండా మరో నాయకుడు పూస రాజుకు బిజెపి అవకాశం ఇచ్చింది. దీంతో విజయలక్ష్మి కాస్త అసంతృప్తికి గురయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పూనుకోలేదు. ప్రస్తుతం ఆమె తటస్తంగా వున్నారు. అందువల్లే ఆమెను కలిసిన బిఆర్ఎస్ నాయకులు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.