Yogi Adityanath : బిజెపిని గెలిపిస్తే హైదరాబాద్ పేరునే మార్చేస్తాం.. : పాతబస్తీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటన
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బిజెపి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాదు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతోంది. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో కేంద్ర నాయకత్వం మొత్తం తెలంగాణలో దిగిపోయారు. కేవలం బిజెపి అభ్యర్ధుల తరపున ప్రచారమే కాదు బిజెపి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా ప్రజలకు వివరిస్తూ బిజెపి నాయకుల ప్రచారం సాగుతోంది. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి పెద్దల ప్రచారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ హీట్ ను మరింత పెంచుతూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ యోగిగా పిలుచుకునే రాజాసింగ్ ఇలాకాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
శనివారం హైదరాబాద్ పాతబస్తి ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో చేపట్టారు. ఈ క్రమంలో గోషామహల్ చౌరస్తాలో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ కు మద్దతుగా మాట్లాడారు. హిందూ ధర్మం కోసం పోరాడే రాజాసింగ్ లాంటివారికి కాపాడుకోవాల్సిన బాధ్యత గోషామహల్ ప్రజలపై వుందని... బిజెపికి ఓటేసి ఇలాంటివారికి మద్దతుగా నిలవాలని సూచించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
Read More Yogi Adityanath..రైతులు, పేదల సంక్షేమం కోసం పాటుపడుతాం: కాగజ్ నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్
తెలంగాణ ప్రజలు బిజెపికి మద్దతుగా నిలిచి అభ్యర్థులందరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని యూపీ సీఎం కోరారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటవుతుందని... అప్పుడే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక అవినీతి, కుంభకోణాల మాటే వినిపించడం లేదని... ఇలాంటి పారదర్శకత కలిగిన పాలనే బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ వుంటుందున్నారు. ఈ పదేళ్ళ పాలనలో కేసీఆర్ అవినీతిని చూసిన ప్రజలకు సుపరిపాలన ఎలా వుంటుందో బిజెపి అధికారంలో వస్తే చూస్తారన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని... బిజెపితోనే మార్పు సాధ్యమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.