సారాంశం

తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  నాలుగు గంటలకే  పోలింగ్ ముగిసింది.  సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నందున  ఈ నియోజకవర్గాల్లో  పోలింగ్ ను  గంట ముందే నిలిపివేశారు.


హైదరాబాద్: తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని  సమస్యాత్మక  ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో ఇవాళ నాలుగు గంటలకే  పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ కేంద్రాల్లో  క్యూ లైన్లలో ఉన్నవారిని  మాత్రమే ఓటింగ్ కు అనుమతిస్తారు. కొత్తగా క్యూలైన్లలోకి చేరేందుకు అనుమతించరు.

  ఈ నియోజకవర్గాల్లో  ప్రచారం కూడ  గంట ముందే  ముగించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది.  మావోయిస్టు ప్రభావం ఈ ప్రాంతంలో ఉంది. దీంతో  సాయంత్రం ఐదు వరకు  పోలింగ్ నిర్వహిస్తే ఈవీఎంలను సురక్షితంగా  స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని  అధికారులు భావించారు. దీంతో  పోలింగ్ ను  గంట ముందే  నిలిపివేశారు.ఈ విషయమై  ఆయా పార్టీలకు ముందే సమాచారం ఉంది.   మరో వైపు రాష్ట్రంలోని మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం  ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

also read:Tammineni Veerabhadram:పాలేరులో ఓటేయని సీపీఐ(ఎం) అభ్యర్ధి తమ్మినేని వీరభద్రం

 రాష్ట్రంలో  35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 4,400 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని  ఎన్నికల సంఘం గుర్తించింది. తెలంగాణలో మూడో దఫా  అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈ దఫానైనా  అధికారాాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.  దక్షిణాదిలో తెలంగాణలో  పాగా వేయాలని బీజేపీ  అస్త్రశస్త్రాలను  సంధించింది.