Tammineni Veerabhadram:పాలేరులో ఓటేయని సీపీఐ(ఎం) అభ్యర్ధి తమ్మినేని వీరభద్రం
పాలేరు అసెంబ్లీ స్థానంనుండి బరిలోకి దిగిన సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం ఓటు విషయంలో సాంకేతిక సమస్య నెలకొంది. నామినేషన్ విషయంలో ఈ సాంకేతిక సమస్య ఆయనకు ఇబ్బంది కల్గించలేదు. కానీ, ఓటు హక్కు నమోదు విషయంలో మాత్రం ఇబ్బంది నెలకొంది.
హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా బరిలోకి దిగిన తమ్మినేని వీరభద్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాంకేతిక కారణాలతో తమ్మినేని వీరభద్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం బరిలో నిలిచారు. తమ్మినేని వీరభధ్రానికి హైద్రాబాద్ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం. పాలేరు నుండి పోటీ చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర నాయకత్వం నిర్ణయించినందున తమ్మినేని వీరభద్రం తన ఓటును తన స్వగ్రామం తెల్దారుపల్లికి బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్నారు.
అయితే తన ఓటుపై తన అడ్రస్ ను మార్చినప్పటికీ నియోజకవర్గాన్ని మార్చలేదు. హైద్రాబాద్ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోనే తమ్మినేని వీరభద్రం మార్చాలని కోరిన అడ్రస్ ను నమోదు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఈ విషయమై ఈసీ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఓటు హక్కును మార్చాలని కోరుతూ తమ్మినేని వీరభద్రం కోరిన ధరఖాస్తు ఆధారంగా ఈసీ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ను నామినేషన్ పత్రాలతో జత చేశారు. దీంతో నామినేషన్ కు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి తమ్మినేని వీరభద్రం ఓటు మాత్రం మారలేదు.దీంతో పాలేరులో తమ్మినేని వీరభద్రం ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ప్రాతినిథ్యం వహించారు. 1996లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఆయన ప్రాతినిథ్యం వహించారు. ఈ దఫా పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగారు.పాలేరు అసెంబ్లీ స్థానం సీపీఐ(ఎం) అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య ప్రాతినిథ్యం వహించారు.
also read:A. Indra Karan Reddy...పార్టీ కండువాతో ఓటు: ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు
సీపీఐ, సీపీఐ(ఎం)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు చర్చలు జరిపింది. అయితే సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకత్వం సాచివేత ధోరణిని అనుసరించిందని సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కూడ ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకత్వానికి ఇచ్చిన గడువు ముగిసినా కూడ ఆ పార్టీ నుండి సీట్ల సర్ధుబాటుపై స్పష్టత రాలేదు. దీంతో సీపీఐ(ఎం) ఒంటరిగా బరిలోకి దిగింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. సీపీఐకి కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ కేటాయించింది.